లాక్‌డౌన్‌ వేళ..కుమారస్వామి కొడుకు పెళ్లి

బెంగళూరు: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ అన్ని వివాహ శుభకార్యాలు రద్దయ్యాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ మాజీ ప్రధాని మనువడి వివాహం జరగడం చర్చనీయాంశమైంది.

Updated : 17 Apr 2020 16:01 IST

బెంగళూరు: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ అన్ని వివాహ శుభకార్యాలు రద్దయ్యాయి. అయితే దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న క్లిష్ట సమయంలో దేశ మాజీ ప్రధాని మనవడి వివాహం జరగడం చర్చనీయాంశమైంది. మాజీ ప్రధానమంత్రి  దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్‌ వివాహం శుక్రవారం జరిగింది. దీనికి బెంగళూరు సమీపంలోని రామనగరలో ఉన్న వారి ఫాంహౌజ్‌ వేదికైంది. ఈ వివాహానికి బయటివారు ఎవ్వరూ హాజరుకానప్పటికీ ఇరు కుటుంబసభ్యుల నడుమ ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి హాజరైన వారు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. ఏ ఒక్కరు కూడా మాస్కులు ధరించకపోగా భౌతిక దూరం కూడా పాటించలేదని ఫోటోలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. పెళ్ళికుమార్తె కూడా ప్రముఖ కాంగ్రెస్‌ నేత దగ్గరి బందువు కావడంతో రాజకీయపరంగా ఈ వివాహానికి ప్రాధాన్యత ఏర్పడింది. 

అయితే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు దూరంగా ఉండాలని వివాహానికి ముందురోజు జేడీఎస్‌ నేత కుమారస్వామి వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. కేవలం తమ కుటుంబాలకు చెందిన 60 నుంచి 70 మంది మాత్రమే హాజరు అవుతారని పేర్కొన్నారు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తామని తెలిపారు.

చర్యలు తీసుకుంటాం..!
అయితే వివాహ కార్యక్రమంపై కర్ణాటక ప్రభుత్వం ముందుగానే స్పందించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే మాత్రం కుమారస్వామిపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి అశ్వంత్‌ నారాయణ్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని సూచించారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో ఇప్పటివరకు 315 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 13 మంది మృత్యువాతపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు