ప్రతి 8గంటలకు ఆరు కొత్త కేసులు

దేశంలో కొవిడ్‌-19 కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైందని వెల్లడించింది. భారత్‌లో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు ఇదేనని....

Updated : 25 Apr 2020 19:31 IST

100 కేసులు నమోదయ్యాక ఇదే అత్యల్ప వృద్ధిరేటు

ఊపందుకున్న  టెస్టు కిట్లు, పీపీఈ, ఎన్‌95 మాస్క్‌ల తయారీ

అత్యున్నత స్థాయి కేంద్ర మంత్రుల కమిటీ వెల్లడి

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైందని వెల్లడించింది. భారత్‌లో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు ఇదేనని పేర్కొంది. కొవిడ్‌-19పై కేంద్ర వైద్యమంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత స్థాయి మంత్రుల కమిటీ 13వ సమావేశం శనివారం జరిగింది.

దేశంలోని కొవిడ్‌-19 ఆస్పత్రుల్ని రాష్ట్రాల వారీగా మంత్రుల కమిటీ వివరించింది. ఐసోలేషన్‌ పడకలు, వార్డులు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సీజన్‌ సిలిండర్ల వివరాలను వెల్లడించింది. గతంలో గుర్తించిన దేశీయ తయారీదారులు పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీని ఆరంభించాయని పేర్కొంది. అన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపింది.

‘దేశం ప్రతి రోజు లక్ష కన్నా ఎక్కువగా పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్క్‌లు తయారవుతున్నాయి. 104 సంస్థలు పీపీఈలు, మూడు సంస్థలు ఎన్‌95 మాస్క్‌లు తయారు చేస్తున్నాయి. దేశీయ సంస్థలు వెంటిలేటర్ల ఉత్పత్తి ఆరంభించాయి.  తొమ్మిది సంస్థల్లో 59వేలకు పైగా ఆర్డర్ చేశాం’ అని కమిటీ వెల్లడించింది.

‘ప్రస్తుతం కొవిడ్‌-19 మరణాల రేటు 3.1 శాతంగా ఉంది. కోలుకుంటున్న వారి శాతం 20 కన్నా ఎక్కువగా ఉంది. చాలా దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగ్గా ఉంది. లాక్‌డౌన్‌, క్లస్టర్‌ నిర్వహణ, కట్టడి వ్యూహం ఫలితంగానే ఇది సాధ్యమైంది. సగటున 9.1 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటివరకు 20.66 శాతం రేటుతో 5,062 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి 1429 కేసులు నమోదయ్యాయి’ అని మంత్రుల కమిటీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 24,506 కేసులు నమోదవ్వగా 775 మంది మరణించారు.

ప్రభుత్వ, ప్రైవేటు ప్రయోగశాలల్లో నమూనాల పరీక్ష, వ్యూహం గురించి కమిటీ వివరించింది. దేశంలో కొవిడ్‌-19 గురించి వివరణాత్మక ప్రజెంటేషన్‌ ఇచ్చింది. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యల గురించి వివరించింది. జిల్లాలు అత్యవసర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా వలస కూలీలకు 92వేల స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, సామాజిక సంస్థలు ఆహారం అందిస్తున్నాయని వెల్లడించింది.

ఆరోగ్య కార్యకర్తలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌వైకే, ఎన్‌సీసీ, వైద్యుల జాతీయస్థాయి మెటాడాటాను రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో పంచుకున్నామని మంత్రుల కమిటీ తెలిపింది. అవసరమైనప్పుడు వాలంటీర్లను మోహరించేందుకు ఇది  ఉపయోగపడుతుందని పేర్కొంది. 1.24 కోట్ల మందికి సంబంధించిన సమాచారం డ్యాష్‌బోర్డులో ఉందని, నిరంతరం దానిని అప్‌డేట్‌ చేస్తున్నామని వెల్లడించింది. ఈ కొవిడ్‌ వారియర్లు ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌, ఐగాట్‌ శిక్షణ పోర్టల్‌ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా శిక్షణ పొందారని తెలిపింది.

పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌, రసాయనాలు, ఎరువుల సహాయమంత్రి మన్‌సుఖ్‌ మండవీయ, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చదవండి: మూడో వ్యాక్సిన్‌కు చైనా అనుమతి

చదవండి: వీరు పేకాటాడితే.. కరోనా షో కొట్టింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని