Voter card to Aadhaar link: చట్ట సవరణ లేకుండానే ఓటరు కార్డుకు ఆధార్‌తో లంకె

ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకే ఓటరు గుర్తింపుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే

Updated : 17 Aug 2022 11:12 IST

కేంద్రం కసరత్తు 

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకే ఓటరు గుర్తింపుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం మరోసారి కసరత్తును ప్రారంభించింది. కొత్త ఓటర్లను నమోదు చేసే సమయంలో ఆధార్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థను కేంద్ర న్యాయశాఖ కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచన ఆధారంగా ఈ మేరకు లేఖ రాసింది. ‘సుపరిపాలన కోసం ఆధార్‌ ధ్రువీకరణ నిబంధన’ల్లోని రూల్‌-3 ప్రకారం అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రజాప్రాతినిధ్య చట్టానికి ఎలాంటి సవరణలు చేయకుండానే ఈ రూలు కింద అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది.

బోగస్‌ ఓటర్లను ఏరివేయడం కోసం ఓటరు కార్డులతో ఆధార్‌ను అనుసంధానం చేయాలని 2015లోనే ఎన్నికల సంఘం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రాయితీల పథకాల అమలు కోసమే తప్ప ఇతరత్రా ఆధార్‌ను వినియోగించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. వ్యక్తిగత గోప్యత దృష్ట్యా అన్నింటికీ ఆధార్‌తో లంకె కుదరదని తెలిపింది. అయితే చట్టంలో తగిన మార్పులు చేసి ఓటరు కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చంటూ 2018 సెప్టెంబరులో తుది తీర్పును ఇచ్చింది. దాంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఈ మేరకు సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం 2019 ఆగస్టులో న్యాయశాఖకు లేఖ రాసింది. ఆధార్‌ అనుసంధానం కానంత మాత్రాన ఎవరి పేరునూ తీసేయబోమని కూడా తెలిపింది. అందువల్ల ఎలాంటి చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండానే, ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ఆ ప్రక్రియను పూర్తి చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని