Vaccine Passport: వ్యాక్సిన్‌ పాస్‌పోర్టులతో పెరిగిన టీకాలు

వ్యాక్సినేషన్‌ విస్తృతి తక్కువగా ఉన్న దేశాల్లో కొవిడ్‌-19 ధ్రువీకరణ లేదా ‘వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు’ల విధానం సత్ఫలితాలనిస్తోంది...

Updated : 15 Dec 2021 12:27 IST

లండన్‌: వ్యాక్సినేషన్‌ విస్తృతి తక్కువగా ఉన్న దేశాల్లో కొవిడ్‌-19 ధ్రువీకరణ లేదా ‘వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు’ల విధానం సత్ఫలితాలనిస్తోంది. ఆయా దేశాల్లో ప్రజలు టీకాలు తీసుకోవడం పెరిగిందని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. కొవిడ్‌-19 ధ్రువీకరణ కింద పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందినట్లు ఆధారాలు, నెగెటివ్‌ టెస్ట్‌ లేదా వ్యాధి నుంచి కోలుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే బహిరంగ వేదికలు, కార్యక్రమాలకు ప్రజలను అనుమతిస్తారు. ఈ తరహా సర్టిఫికేషన్‌ వల్ల మరింత ఎక్కువ మంది ప్రజలు టీకాలు పొందేలా ప్రోత్సాహం లభిస్తుందన్నది నిపుణుల విశ్లేషణ. ముఖ్యంగా.. కొవిడ్‌తో తమకు పెద్దగా ఇబ్బంది ఉండబోదని భావించే వారిని ఇది దారిలోకి తెస్తుందని వారు పేర్కొంటున్నారు. తాజా పరిశీలనలో భాగంగా.. ధ్రువీకరణను తప్పనిసరి చేసిన డెన్మార్క్, ఇజ్రాయెల్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ పరిస్థితిని పరిశోధకులు పరిశీలించారు. అక్కడ కొవిడ్‌ ధ్రువీకరణ పత్రానికి, వ్యాక్సినేషన్‌ స్థాయి మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. టీకా విస్తృతి తక్కువగా ఉన్న దేశాల్లో ఈ సర్టిఫికేషన్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రతి పది లక్షల మందిలో వ్యాక్సిన్‌ డోసులు పొందినవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అది 1,27,823గా, ఇజ్రాయెల్‌లో 2,43,151, స్విట్జర్లాండ్‌లో 64,952, ఇటలీలో 66,382గా ఈ పెరుగుదల ఉంది. సర్టిఫికేషన్‌ను ప్రవేశపెట్టడానికి ముందే సరాసరి వ్యాక్సినేషన్‌ రేటు అధికంగా ఉన్న డెన్మార్క్, జర్మనీల్లో మాత్రం ఇలాంటి పెరుగుదల పెద్దగా లేదు. సర్టిఫికేషన్‌ను ప్రవేశపెట్టాక.. 30 ఏళ్లు లోపువారిలో వ్యాక్సినేషన్‌ పెరిగినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని