పుల్వామా అమరులకు రాహుల్‌ నివాళులు

భారత్‌ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పుల్వామాలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు.

Published : 29 Jan 2023 03:28 IST

లేథ్‌పొరా: భారత్‌ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పుల్వామాలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు. 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు కారు బాంబు దుశ్చర్యకు పాల్పడగా జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై బస్‌లో వెళ్తున్న జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన స్థలంలో రాహుల్‌ పుష్పాంజలి ఘటించారు. ఇందుకోసం పాదయాత్రను కొద్ది సమయం పాటు నిలిపివేశారు. శనివారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని అవంతిపొర జిల్లా చుర్సూ నుంచి రాహుల్‌ యాత్రను పునఃప్రారంభించారు. అంతకుముందు రోజు భద్రతా కారణాలతో కార్యక్రమాన్ని అర్థంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం ఈ కార్యక్రమం కొనసాగింది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ యాత్రలో భాగస్వాములయ్యారు. రాహుల్‌తో కలిసి నడిచారు. రాహుల్‌ పాదయాత్రలో శనివారం ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా, పౌర సమాజానికి చెందిన యోగేంద్ర యాదవ్‌ కూడా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం జోడో యాత్ర పంథాచౌక్‌ నుంచి మొదలవుతుంది. శ్రీనగర్‌కు చేరుకోవడంతో పూర్తవుతుంది. సోమవారం రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత ముగింపు సభను నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని