ఇన్‌ఫ్లుయెంజాతో జాగ్రత్త: కేంద్రం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా సంబంధ అనారోగ్యం(ఐఎల్‌ఐ)వ్రమైన శ్వాస సంబంధ ఇన్‌ఫెక్షన్‌(ఎస్‌ఏఆర్‌ఐ) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌ హెచ్చరించారు.

Updated : 12 Mar 2023 05:58 IST

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా సంబంధ అనారోగ్యం(ఐఎల్‌ఐ)వ్రమైన శ్వాస సంబంధ ఇన్‌ఫెక్షన్‌(ఎస్‌ఏఆర్‌ఐ) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాశారు. ‘‘ఇన్‌ఫ్లుయెంజా ఏటా సీజనల్‌గా వస్తుంది. ప్రస్తుత సీజన్‌లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండటం, ప్రజల జీవనశైలిలో మార్పులు రావడం (తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎదుటివారికి సమీపంలో తుమ్మడం, దగ్గడం, ఇరుకు స్థలాల్లో ఎక్కువమంది గుమికూడటం), మరోవైపు ఇన్‌ఫ్లుయెంజా ఎ (హెచ్‌1ఎన్‌1, హెచ్‌3ఎన్‌2), ఎడినోవైరస్‌లు వేగంగా వ్యాప్తిచెందడానికి అనుకూలంగా వాతావరణం మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐఎల్‌ఐ/ఎస్‌ఏఆర్‌ఐ తీవ్రత పెరుగుతూ వస్తోంది. డిసెంబరు రెండో పక్షం నుంచి హెచ్‌3ఎన్‌2 ప్రభావం పెరగడం ప్రారంభమైంది. చిన్నారులు, వయోవృద్ధులు, రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు ఉన్న వారికి హెచ్‌1ఎన్‌1, హెచ్‌3ఎన్‌2, అడినోవైరస్‌లు సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కొవిడ్‌ ప్రభావం చెప్పుకోదగ్గస్థాయిలో తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పాజిటివిటీ రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని వెంటనే అరికట్టాలి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ దీని వ్యాప్తిపై నిఘా ఉంచడంతోపాటు టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ నియంత్రణకు అనువైన నిబంధనలను అనుసరించాలి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఐసీఎంఆర్‌ వీఆర్‌డీఎల్‌ నెట్‌వర్క్‌ ల్యాబ్‌ ద్వారా సేకరించి పరీక్షించిన నమూనాల్లో 25.4% మేర అడినోవైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. దీనివల్ల శ్వాసకోశ సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌తోపాటు జ్వరం, దగ్గు లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వయోవృద్ధులు, స్థూలకాయులు, దీర్ఘకాలంగా శ్వాససంబంధమైన ఇబ్బందులు, మధుమేహం, గుండె సమస్యలు, దీర్ఘకాల కిడ్నీ, లివర్‌ సమస్యలున్నవారు, గర్భిణులు దీనివల్ల ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకొనేలా అప్రమత్తంచేయాలి. దగ్గు, తుమ్ము, చీదేటప్పుడు మొహానికి చేతులు లేదా టిష్యూనో అడ్డుగాపెట్టుకోవాలని, బహిరంగప్రాంతాల్లో ఉమ్మడం ఆపాలని చెప్పాలి. మాస్కులు పెట్టుకోవడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడాన్ని ప్రోత్సహించాలి. అన్ని రాష్ట్రాలూ ఐఎల్‌ఐ వ్యాప్తిని పరిశీలించాలి. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌, అడినోవైరస్‌లను గుర్తించేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ నమూనాలను పరీక్షలకోసం ల్యాబ్‌లకు పంపాలి. ఆసుపత్రుల్లోని పరిస్థితులను సమీక్షించి మందులు, వైద్యపరికరాలు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేలా మానవ వనరులకూ తగిన శిక్షణ ఇప్పించాలి’’ అని రాజేష్‌భూషణ్‌ ఈ లేఖలో రాష్ట్రాలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని