బిహార్‌లో 63 శాతం బీసీలే

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బిహార్‌ కుల గణన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 13.07 కోట్లున్న రాష్ట్ర జనాభాలో 63.13శాతం బీసీలే ఉన్నారని తేలింది.

Updated : 03 Oct 2023 06:26 IST

అత్యంత వెనుకబడినవారు 36%
ఇతర వెనుకబడినవారు 27.13%
ఓబీసీల్లో యాదవులు 14.27%
దళితులు 19.65%
కులగణన వివరాల వెల్లడి

పట్నా: దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బిహార్‌ కుల గణన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 13.07 కోట్లున్న రాష్ట్ర జనాభాలో 63.13శాతం బీసీలే ఉన్నారని తేలింది. ఇందులో అత్యంత వెనుకబడినవారు 36శాతం, ఇతర వెనుకబడినవారు 27.13శాతం ఉన్నారు. బిహార్‌ అభివృద్ధి కమిషనరు వివేక్‌ సింగ్‌ సోమవారం పట్నాలో కుల గణన వివరాలను వెల్లడించారు.

కేంద్రం కాదనడంతో..

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు కులగణనను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.


చరిత్రాత్మకం

-నీతీశ్‌

కుల గణన చరిత్రాత్మకమని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అధికారులు భారీ కసరత్తు చేసి వివరాలను బయటకు తీసుకొచ్చారని కొనియాడారు. రాష్ట్రంలోని 9 రాజకీయ పార్టీలతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి కుల గణన వాస్తవాలను, వివరాలను అందిస్తామని తెలిపారు. బిహార్‌లో కుల గణనను మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ స్వాగతించారు. ఇది దేశవ్యాప్త సర్వేకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.  


కంటితుడుపే

-భాజపా

కుల గణన కేవలం కంటి తుడుపు చర్యేనని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విమర్శించారు. తాజాగా వెల్లడైన గణాంకాలు ప్రజల్లో ఎన్నో సందేహాలను రేకెత్తిస్తున్నాయని చెప్పారు. నివేదికను పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని భాజపా బిహార్‌శాఖ అధ్యక్షుడు సామ్రాట్‌ చౌధరి తెలిపారు. ఈ సర్వేకు భాజపా మద్దతిచ్చిందని, తాము అధికారంలో ఉండగానే సర్వే మొదలైందనే విషయాన్ని గుర్తు చేశారు.

  • ఓబీసీల్లో యాదవులు అత్యధికంగా 14.27శాతం ఉన్నారు.
  • రాష్ట్రంలో దళితులు 19.65శాతం ఉన్నారు. గిరిజనులు కేవలం  1.68శాతమే (22 లక్షలు) ఉన్నారు.
  • అగ్ర కులాలవారు రాష్ట్ర జనాభాలో 15.52శాతం ఉన్నారు.
  • మొత్తం జనాభాలో హిందువులు 81.99 శాతంగా ఉన్నారు. ముస్లింల జనాభా 17.7శాతంగా ఉంది.
  • క్రైస్తవులు, సిక్కులు, జైన్లు వేళ్లమీద లెక్కబెట్టేంత స్థాయిలోనే ఉన్నారు.  

దేశవ్యాప్తంగా జరపాలి

-కాంగ్రెస్‌

కుల గణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండు చేసింది. బిహార్‌ నిర్వహించిన కుల గణనను స్వాగతించింది. బిహార్‌ సర్వే రాష్ట్రంలో 84శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారని నిరూపించిందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. వారికి ఆ స్థాయిలో భాగస్వామ్యం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టామని, అయితే మోదీ ప్రభుత్వం ఆ వివరాలను బయటపెట్టలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. బిహార్‌ను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా సర్వే చేపట్టాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు