చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక చెల్లదు

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. భాజపా నేత మనోజ్‌ సోంకార్‌ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది.

Published : 21 Feb 2024 05:24 IST

 ఆప్‌-కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థికి పట్టం 
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రిటర్నింగ్‌ అధికారిది దుర్మార్గ వైఖరి
కోర్టుకు అబద్ధాలు చెప్పారు
ఆయనను ప్రాసిక్యూట్‌ చేయండి
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం

దిల్లీ: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. భాజపా నేత మనోజ్‌ సోంకార్‌ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఎన్నికైనట్లుగా ప్రకటించింది. బ్యాలెట్‌ పేపర్లను ఏమార్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని ఆదేశించింది. ఆయన దుర్మార్గంగా వ్యవహరించారని, అబద్ధాలు చెప్పారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ధర్మాసనంలో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌  మనోజ్‌ మిశ్ర ఉన్నారు. ‘జనవరి 30వ తేదీన జరిగిన మేయర్‌ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారు. ఆయనది దుష్ప్రవర్తనే. అయితే ఎన్నిక మొత్తాన్ని రద్దు చేయడం లేదు. జరిగిన తప్పులను సరిదిద్దుతున్నాం. కుల్దీప్‌ కుమార్‌కు పోలైన ఓట్లలో చెల్లనివిగా పేర్కొన్న 8 ఓట్ల అంశంలో చోటుచేసుకున్న తప్పిదాలను సవరిస్తున్నాం. ఈ విషయంలో మసీహ్‌ ఉద్దేశపూర్వకంగా 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘అనిల్‌ మసీహ్‌ రెండు అంశాల్లో తప్పులు చేశారు. మొదటిది.. చట్ట విరుద్ధంగా మేయర్‌ ఎన్నికలను తారుమారు చేశారు. రెండోది.. సుప్రీంకోర్టు ఎదుట సోమవారం తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దీనికి ఆయన బాధ్యత వహించాల్సిందే. ప్రిసైడింగ్‌ అధికారిగా తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇచ్చిన అనంతరం ఎదురయ్యే పర్యవసానాల గురించి ఆయన నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉండాల్సింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లను ట్యాంపరింగ్‌ చేశారని పేర్కొంటూ 8 ఓట్లను రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ తిరస్కరించారు. దీంతో 16 ఓట్లు వచ్చిన మనోజ్‌ సోంకార్‌ విజయం సాధించారు. ఆప్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌కు 12 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టును ఆప్‌ ఆశ్రయించింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం భాజపా అభ్యర్థి ఎన్నికను రద్దు చేసింది. కుల్దీప్‌ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించింది. విచారణ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్‌ పేపర్లను ధర్మాసనం పరిశీలించింది. ‘ఈ బ్యాలెట్‌ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా..’ అంటూ మసీహ్‌ను ప్రశ్నించింది. ‘అవి ఆప్‌ అభ్యర్థికి వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు’ అని సీజేఐ పేర్కొన్నారు. ఆ పేపర్లను కోర్టులోని ఇరుపక్షాల న్యాయవాదులకు చూపించారు. మసీహ్‌ చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజేఐ.. లెక్కింపు వీడియోను మరోసారి చూశారు. ‘అందరినీ ఈ వీడియో చూడనివ్వండి. జీవితంలో వినోదం మంచిదే. అయితే కౌంటింగ్‌ వీడియో మొత్తం చూడాల్సిన పనిలేదు. అంతా వేస్తే సాయంత్రం 5.45 గంటల వరకూ ఇక్కడే ఉంటాం’ అని సరదాగా వ్యాఖ్యానించారు.


సుప్రీంకు కృతజ్ఞతలు: కేజ్రీవాల్‌

క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు రక్షించిందని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకున్నందుకు మంగళవారం ‘ఎక్స్‌’లో కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మరింత దూరం ప్రయాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని