మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి

గుజరాత్‌ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది.

Published : 19 Mar 2024 04:13 IST

గుజరాత్‌ వర్సీటీలో గొడవపై ఆ రాష్ట్ర హైకోర్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా తమను దర్యాప్తు సంస్థగా మార్చొద్దంటూ వ్యాఖ్యానించింది. తాము పోలీసు ఇన్‌స్పెక్టర్లం కామంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా అగర్వాల్‌, జస్టిస్‌ అనిరుద్దా పి మాయీలతో కూడిన ధర్మాసనం ఘాటుగా పేర్కొంది. రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానంగా వ్యవహరించడమే తమ విధంటూ పేర్కొన్నారు. ఆ వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేసింది. నగరంలో జరిగే ప్రతి వ్యవహారానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం హక్కు ఉండదని కోర్టు వెల్లడించింది. అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీ వసతి గృహంలో శనివారం రాత్రి కొందరు విదేశీ విద్యార్థులు నమాజుకు యత్నించడంపై మరికొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన గొడవలో శ్రీలంక, తజికిస్థాన్‌లకు చెందిన విద్యార్థులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై 20-25 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. కేసు దర్యాప్తు చేయడానికి తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ అయిదుగురు అనుమానితులను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని