TamilNadu: ముదిరిన వివాదం.. గవర్నర్‌పై సీఎం తీవ్ర ఆరోపణలు!

తమిళనాడు (TamilNadu) గవర్నర్‌ ఆర్‌ఎన్ రవి (R N Ravi)పై సీఎం స్టాలిన్‌ (CM Stalin) మరోసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్నారని లేఖలో ఆరోపించారు.

Updated : 09 Jul 2023 20:10 IST

చెన్నై: తమిళనాడు (TamilNadu)లో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మరింత ముదిరింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి (R N Ravi) రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, దానివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీఎం స్టాలిన్‌ (CM Stalin) ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)కు ఫిర్యాదు చేస్తూ.. సీఎం లేఖ రాసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. గతంలో కూడా గవర్నర్‌ తీరు గురించి సీఎం స్టాలిన్‌ రాసిన లేఖను రాష్ట్రపతికి డీఎంకే (DMK) పార్టీ ఎంపీల బృందం అందించింది.  

‘‘గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 159 ప్రకారం ప్రమాణం చేసి, పదవి చేపట్టిన తర్వాత దాన్ని ఉల్లంఘించారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చర్యల కారణంగా తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది’’ అని సీఎం లేఖలో ఆరోపించారు. మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేసి, తిరిగి ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గడం ద్వారా గవర్నర్‌ తన రాజకీయ వైఖరిని ప్రదర్శించారని సీఎం స్టాలిన్‌ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు గత ఏఐఏడీఎంకే (AIADMK) ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ఆ పార్టీ నాయకులపై విచారణ విషయంలో గవర్నర్‌ ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత కొంత కాలంగా గవర్నర్‌ వ్యవహరిస్తున్న తీరు ఆయన ఈ పదవికి అర్హుడు కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోందని సీఎం స్టాలిన్‌ లేఖలో పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని పదవిలో కొనసాగించడం ఏ మాత్రం సముచితం కాదని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలా? వద్దా? అనే నిర్ణయాధికారం రాష్ట్రపతికే విడిచిపెడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

కొద్దిరోజుల క్రితం అవినీతి ఆరోపణలతో ఈడీ అధికారులు మంత్రి సెంథిల్‌ బాలాజీని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆయనకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో సెంథిల్‌ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గవర్నర్‌ నిర్ణయాన్ని భాజపాయేతర పార్టీలు ఖండించాయి. అంతకుముందు రాష్ట్ర శాసనసభలో తమిళనాడు, ద్రవిడ మోడల్‌ వంటి పదాలు, ద్రవిడ నాయకుల పేర్లను వదిలేసి గవర్నర్‌ ప్రసంగించడం వివాదాస్పదమైంది. ఆయన తీరుపై అధికార డీఎంకే కూటమి పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన్ను రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని