60 ఏళ్ల తర్వాత తొలిసారి: గిఫ్ట్‌ సిటీలో లిక్కర్‌ ఓకే.. గుజరాత్‌ సర్కార్‌ నిర్ణయం

Gift city: గిఫ్ట్‌ సిటీలో మద్యానికి అనుమతిస్తూ గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతిథులకు, ఉద్యోగులకు మద్యం సేవించేందుకు అనుమతిచ్చింది.

Published : 24 Dec 2023 01:58 IST

Gift city | దిల్లీ: మద్యపాన నిషేధం అమలౌతున్న రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గిఫ్ట్‌ సిటీగా (GIFT City) పిలిచే గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీలో మద్యానికి అనుమతి ఇచ్చింది. గుజరాత్‌లో మద్య నిషేధం నిబంధనను తొలిసారి సడలించడం విశేషం. రాష్ట్రంలో మాత్రం యథావిధిగా మద్య నిషేధం అమల్లో ఉంటుంది. 

1960లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గుజరాత్‌లో మద్య నిషేధం అమలౌతోంది. మహాత్మ గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా దాదాపు 60 ఏళ్లుగా ఇక్కడ మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. తాజాగా ఆ నిబంధనను సడలించింది. గాంధీనగర్‌లో ఏర్పాటైన గిఫ్ట్‌ సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ఆల్కహాల్‌ సేవనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.

గిఫ్ట్ సిటీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించాలంటే ఇక్కడా గ్లోబల్‌ బిజినెస్‌ ఎకో సిస్టమ్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే వారు, గిఫ్ట్‌సిటీలో పనిచేసే ఉద్యోగులు ఆల్కహాల్‌ను సేవించొచ్చు.

గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌, ఆప్‌ భగ్గుమన్నాయి. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడానికే తొలుత గిఫ్ట్‌సిటీని ఎంచుకున్నారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల యువత మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉందని, నేరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని