4 ఏళ్ల చిన్నారి.. కుటుంబాన్ని కాపాడింది!

ఆ పాప పేరు ఎమిలియా. వయసు 4ఏళ్లు. ఇంట్లో తన పెంపుడు శునకాలతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ ఇల్లంతా తిరుగుతోంది. ఇంతలో కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు కన్పించాయి. ఆ సమయంలో

Updated : 08 Dec 2022 16:57 IST

(ఫొటో: డేనియల్‌ పాట్రిక్‌ ఇన్‌స్టా నుంచి)

ఫ్లోరిడా: ఆ పాప పేరు ఎమిలియా. వయసు 4ఏళ్లు. ఇంట్లో తన పెంపుడు శునకాలతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ ఇల్లంతా తిరుగుతోంది. ఇంతలో కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు కన్పించాయి. ఆ సమయంలో అమ్మ పెరట్లో ఉంది. నాన్న బాత్రూంలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియక భయపడిపోయిన ఆ చిన్నారి పరుగున బాత్రూం వద్దకు వెళ్లింది. ‘డాడీ.. ఫైర్‌’ అంటూ తలుపులు బాదింది. దీంతో ఆ తండ్రి కిచెన్‌లోకి వచ్చి చూడగా ఎయిర్‌ ఫ్రయర్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే ఆయన ఆ ఎయిర్‌ఫ్రయర్‌ను తీసుకెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌లో పడేశారు. మంటలను ఆర్పేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ చిన్నారి అప్రమత్తతే వారి కుటుంబాన్ని కాపాడింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన. 

ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోలను పాప తండ్రి డేనియల్‌ పాట్రిక్‌ జెర్మిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ఈ రోజు నా కూతురే మా ఇంటిని కాపాడింది. ఎయిర్‌ఫ్రయర్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. అప్పుడు ఎమిలియా ఒక్కతే అక్కడ ఉంది. వెంటనే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. బ్యాగ్రౌండ్‌లో పాటల శబ్దాలు ఉన్నప్పటికీ తన మంటలను గుర్తించి నన్ను అప్రమత్తం చేసింది. నిజంగా ఎమిలియా రియల్‌ హీరో’’ అంటూ తన గారాలపట్టికి ధన్యవాదాలు చెప్పాడా తండ్రి. 

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో డేనియల్‌ పాదాలకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఒకవేళ పాపగానీ సమయానికి అప్రమత్తం చేసి ఉండకపోతే పెను ప్రమాదమే జరిగి ఉండేదని ఆయన వెల్లడించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. చిన్నారి నిజంగా ధైర్యవంతురాలు అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని