అర్ధరాత్రి రెస్టారంట్‌ సిబ్బందితో ఘర్షణ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌పై వేటు

ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ రెస్టారంట్‌(Rajasthan Eatery)లో జరిగిన గొడవలో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌ కావడంతో వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

Published : 14 Jun 2023 18:11 IST

అజ్మీర్‌: అర్ధరాత్రి వేళ రెస్టారంట్(Rajasthan Eatery) సిబ్బందితో ఘర్షణకు దిగిన ఘటనలో ఇద్దరు ఐఏఎస్‌(IAS), ఐపీఎస్‌(IPS) అధికారులపై రాజస్థాన్‌(Rajasthan) ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారితో పాటు మరికొంతమంది సిబ్బందిపైనా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన దృశ్యాలు వైరల్ కావడం, ఈ వ్యవహారం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ దృష్టికి చేరడంతో ఈ చర్యలు అమలయ్యాయి. 

ఐఏఎస్‌ అధికారి గిరిధర్.. అజ్మీర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా ఉన్నారు. గంగాపుర్‌ సిటీ పోలీసు విభాగానికి ఐపీఎస్‌ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్..ఓఎస్‌డీగా నియమితులయ్యారు. ఈ కొత్త నియామకాన్ని పురస్కరించుకొని పార్టీ చేసుకునే క్రమంలోనే అధికారులకు, రెస్టారంట్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. దీనిపై రెస్టారంట్‌ యజమాని మాట్లాడుతూ.. ‘ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఇద్దరు అధికారులు తమ స్నేహితులతో కలిసి రెస్టారంట్‌కు వచ్చారు. వారు వచ్చిన సమయంలో మా సిబ్బంది కొందరు నిద్రపోతున్నారు. దాంతో వారు మా సిబ్బందితో గొడవకు దిగారు. దీనిపై నాకు సమాచారం అందగానే.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నా ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐపీఎస్‌ అధికారితో కలిసివచ్చారు. కర్రలు, ఇనుప రాడ్లతో మా వాళ్లపై దాడి చేశారు. ఈ ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. వారిలో కొంతమందికి ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి’ అని తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో స్థానిక పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ గొడవపై నిరసన వ్యక్తం కావడం, సీసీటీవీ దృశ్యాలు వైరల్ కావడంతో అజ్మీర్ ఎస్పీ సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులపైనా వేటు పడింది. 

అయితే సుశీల్ కుమార్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ‘నేను ఆ ఘర్షణకు పాల్పడి ఉంటే.. గుర్తుతెలియని వ్యక్తులపై ఎందుకు కేసు నమోదు చేశారు. గొడవ గురించి తెలిసి, నా విధుల్లో భాగంగా అక్కడికి వెళ్లాను. మా సిబ్బందితో అక్కడికి వెళ్లేసరికి, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. మేం వెళ్లి ఆ పరిస్థితులను ఓ కొలిక్కి తెచ్చాం’అని వెల్లడించారు. ప్రస్తుతం విజిలెన్స్ విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని