Japan: ఇండో-పసిఫిక్‌లో భారత్‌ విడదీయలేని భాగస్వామి: జపాన్‌

భారత్‌-జపాన్‌ ఫోరం సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వాడ్‌ పని ముగిసిందని అందరు అనుకునే సమయంలో అది రెట్టింపు శక్తితో వస్తుందన్నారు. 

Updated : 28 Jul 2023 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండో-పసిఫిక్‌లో జపాన్‌(Japan)కు భారత్‌ (India) విడదీయలేని భాగస్వామి అని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి యోషిమస హయషి పేర్కొన్నారు. ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న దిల్లీకి చేరుకొన్నారు. నేడు ఇండియా-జపాన్‌ ఫోరమ్‌లో ప్రసంగించారు. భవిష్యత్తులో భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పారు. ఇండో-పసిఫిక్‌ క్షేత్రంలో యథాతథ పరిస్థితిని బలవంతంగా మార్చేందుకు యత్నిస్తే ఏమాత్రం సహించేది లేదన్నారు. హిరోషిమాలో మేలో జరిగిన జీ-7 సదస్సులో సభ్యదేశాల నాయకులు చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

భారత్‌ జీ20 నాయకత్వాన్ని విజయంతం చేసేందుకు కలిసి పనిచేయడానికి జపాన్‌ చాలా ఉత్సాహంగా ఉందని హయషి పేర్కొన్నారు. తాము త్వరలో జరగనున్న ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఫోరమ్‌పై దృష్టిపెట్టామన్నారు. గ్లోబల్‌ సౌత్‌గా అభివర్ణించే పేద దేశాల సమస్యలను తీర్చకపోతే అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలనే  పిలుపు కేవలం నినాదంగా ఉండిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదేం వాతావరణం.. లక్ష సంవత్సరాల్లో ఇంత వేడి లేదు..!

ఈ కార్యక్రమంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మాట్లాడుతూ.. భారత్‌కు జపాన్‌ సహజమిత్ర దేశమని అభివర్ణించారు. క్వాడ్‌ విషయంలో తాను ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ప్రతి క్వాడ్‌ సమావేశం అజెండా ఆధారంగానే జరుగుతుంది. మేము వివిధ అంశాలపై పనిచేసేలా చేస్తుంది. మేం ఎటు పయనిస్తున్నామన్న దానిపై చాలా ఆలోచనలున్నాయి. 1945-50 మధ్యలో పుట్టుకొచ్చిన అలయన్స్‌ వంటి  మార్గంలో వెళ్లడంలేదు. మేం క్వాడ్‌ను 2017లో పునరుద్ధరించాం. ప్రతి ఆరు నెలలకు ఈ కూటమి పనైపోయిందని చెబుతుంటారు.. కానీ, పునర్జన్మ పొందిన ప్రతిసారి అది మరింత బలంగా ఉంటుంది. క్వాడ్‌ ప్రతి మీటింగ్‌లో అజెండాను మరింత బలోపేతం చేస్తుంది’’ అని అన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఇరుదేశాల మంత్రులు ఉగ్రవాదం, టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలు, ఆధునికీకరణపై చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని