Ramesh Bidhuri: బీఎస్పీ ఎంపీపై కామెంట్స్‌.. పార్టీ ఎంపీకి భాజపా షోకాజ్‌ నోటీస్‌

Speaker warns Ramesh Bidhuri: బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థిపై భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.

Updated : 22 Sep 2023 16:19 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల వేళ దిల్లీకి చెందిన భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరీ (Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ(BSP)కి చెందిన ఎంపీ డానిష్‌ అలీపై (Danish Ali) లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. ఆయనను సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సైతం రమేశ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. భాజపా ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

గురువారం చంద్రయాన్‌-3 విజయంపై చర్చ సందర్భంగా బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీని అభ్యంతరకర పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలను ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించారు. బిధూరీ వ్యాఖ్యల పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ‘‘డానిష్‌ అలీ గురించి బిధూరీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఇలాంటి పదజాలం ఇంతకుముందెన్నడూ వినలేదు. పార్లమెంట్‌ కొత్త భవనం ఇలాంటి మాటలతో ప్రారంభం కావడం బాధాకరం. బిధూరీ వ్యాఖ్యలు భాజపా ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు.

EVM సోర్స్‌కోడ్‌పై ఆడిట్‌ నిర్వహించాలని పిల్‌.. నిరాకరించిన సుప్రీం కోర్టు

ఓబీసీలను, ముస్లింలను అవమానించడం భాజపా సంస్కృతిలో భాగమని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ముస్లిం ఎంపీ పట్ల భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దేశంలోని గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. ప్రధాని ఆదేశానుసారమే పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీపై భాజపా సభ్యుడు అసభ్య పదజాలం వినియోగించడం తీవ్ర అభ్యంతకరమని పేర్కొన్నారు. 

స్పీకర్‌ సీరియస్‌.. పార్టీ షోకాజ్‌ నోటీసులు

ఎంపీ వ్యాఖ్యల పట్ల స్పీకర్‌ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు అధికార వర్గాల తెలిపాయి. ఈ వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విచారం వ్యక్తంచేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు డానిష్‌ అలీ లేఖ రాశారు. అభ్యంతరక పదజాలాన్ని వినియోగించడం పట్ల భాజపా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

  • మరోవైపు రమేశ్‌ బధూరీ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న భాజపా నేత హర్షవర్దన్‌.. నవ్వుతూ కనిపించడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. రమేశ్‌ ఏం మాట్లాడారో తనకు సరిగా వినిపించలేదని, తనకు సంబంధం లేకపోయినా కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారంటూ పోస్ట్‌ చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని