Maldives: బోట్ల అడ్డగింత.. భారత్‌ వివరణ ఇవ్వాలి: మాల్దీవులు

మాల్దీవులకు చెందిన ఫిషింగ్‌ బోట్లను భారత్‌ బలగాలు అడ్డగించాయని, దీనిపై వివరణ ఇవ్వాలని ఆ దేశ విదేశాంగశాఖ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.

Updated : 03 Feb 2024 19:10 IST

మాలే: భారత్‌ (India), మాల్దీవుల (Maldives) మధ్య సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. భారత్‌ సైనిక బలగాలు తమ దీవులను వదిలివెళ్లాలని అధ్యక్షుడు ముయిజ్జు (Muizzu) గడువు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ దేశానికి చెందిన ఫిషింగ్‌ బోట్లను భారత్‌ బలగాలు అడ్డుకున్నాయని, ఎందుకు ఇలా చేయాల్సివచ్చిందో సమగ్ర వివరాలు సమర్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు ఆ దేశ విదేశాంగశాఖ అధికారికంగా లేఖ రాసింది. తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తే అడ్డగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. దీనిపై ఇప్పటివరకు భారత్‌ స్పందించలేదు. 

జనవరి 31న ప్రత్యేక వాణిజ్య జోన్‌ (ఈఈజెడ్‌)లో మాల్దీవులకు చెందిన మూడు ఫిషింగ్‌ బోట్లను ఇండియన్‌ కోస్టు గార్డు అడ్డగించినట్లు లేఖలో పేర్కొంది. మాల్దీవుల ఈఈజడ్‌ పరిధిలో వేట సాగిస్తున్న బోట్లను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను ఉల్లంఘించి ఎందుకు అడ్డగించాల్సి వచ్చిందో తెలియజేయాలని కోరింది. కోస్టుగార్డుకు చెందిన 246, 253 బృందాలు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపింది.

మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్‌ ముయిజ్జు ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి భారత్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గత అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ భారత్‌ అనుకూల విధానాలను అవలంబించగా.. ముయిజ్జు మాత్రం చైనా బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా పరిశోధక నౌకను కూడా తమ జలాల్లోకి అనుమతించారు. దీనిపై భారత్‌ అభ్యంతరం వ్యక్తంచేయగా.. తమ అనుమతితోనే వచ్చిందని వెనకేసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు