INDIA: ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే? పలువురి నేతల ప్రతిపాదన!

దిల్లీ జరిగిన ఇండియా కూటమి నేతల భేటీ ముగిసింది. ఈ భేటీలో పలువురు నేతలు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది.

Updated : 19 Dec 2023 19:24 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలోని అశోకా హోటల్‌లో జరిగిన విపక్ష కూటమి ఇండియా (INDIA) నాలుగో సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కీలక భేటీలో పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలతో పాటు రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చించారు. అయితే, ఇండియా కూటమి ప్రధాన మంత్రి(Prime Minister) అభ్యర్థిగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్‌ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. ‘తొలుత సమష్టిగా పోరాడదాం.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దాం’ అని చెప్పినట్లు సమాచారం. 

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తాజాగా జరిగిన విపక్షాల కూటమి ‘ఇండియా’ భేటీ ముగిసిన అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 విపక్ష పార్టీల నేతల సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా కనీసం 8 నుంచి 10 సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. 

22న దేశవ్యాప్త నిరసనలు

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని తాము కోరుతుంటే.. పార్లమెంటులో వారు ఎందుకు మాట్లాడటం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్‌పై డిసెంబర్‌ 22న దేశ వ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలు రాష్ట్ర స్థాయిల్లోనే జరుగుతాయని.. అక్కడ ఏదైనా సమస్య ఉంటే కేంద్ర స్థాయిలో చర్చిస్తామన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, బిహార్, యూపీ, దిల్లీ లేదా పంజాబ్‌ ఎక్కడైనా సరే సీట్ల పంపకంలో సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.

జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకం ఖరారు!

జనవరి రెండో వారం లోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఖర్గే చెప్పారు. ‘ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి మీరేనా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ..  తొలుత తాము గెలిచి మెజార్టీ సాధించాలని.. ఆ తర్వాతే ఎంపీలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతల్లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్‌, శరద్‌ పవార్‌, సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్‌, కేజ్రీవాల్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని