బెంగళూరులో బాలుడి మిస్సింగ్‌.. సోషల్‌ మీడియా సాయంతో హైదరాబాద్‌లో ఆచూకీ

Boy Missing: మూడు రోజుల క్రితం బెంగళూరులో కన్పించకుండాపోయిన ఓ బాలుడు హైదరాబాద్‌ (Hyderabad)లో ప్రత్యక్షమయ్యాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫొటోలతో అతడిని గుర్తించి కుటుంబానికి సమాచారమిచ్చారు. 

Updated : 24 Jan 2024 11:55 IST

బెంగళూరు/హైదరాబాద్‌: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం (Boy Missing) కథ సుఖాంతమైంది. మూడు రోజుల క్రితం కన్పించకుండా పోయిన అతడిని హైదరాబాద్‌ (Hyderabad)లో గుర్తించారు. సోషల్‌మీడియా సాయంతో బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. (Missing Bengaluru boy found in Hyderabad)

బెంగళూరుకు చెందిన పరిణవ్‌ స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం కోచింగ్‌ సెంటర్‌కని ఇంటి నుంచి బయల్దేరారు. కోచింగ్‌ సమయం పూర్తయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.

జనవరి 21న ఉదయం 11 గంటలకు కోచింగ్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చిన పరిణవ్‌.. అక్కడి నుంచి బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. చివరగా బెంగళూరు మేజిస్టిక్‌ బస్టాండ్‌ వద్ద కన్పించిన అతడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో తెలియరాలేదు. ఆ బస్టాండ్‌ నుంచి కర్ణాటకలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు వెళ్తుండటంతో బాలుడిని కనిపెట్టడం కష్టంగా మారింది.

అదే సమయంలో బాలుడి ఆచూకీ కోసం అతడి తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేశారు. చివరగా అతడు కన్పించిన సీసీటీవీ దృశ్యాలను కూడా అందులో పంచుకున్నారు. ఇవి కాస్తా వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉంటున్న ఓ బెంగళూరు వాసి బుధవారం ఉదయం బాలుడిని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో గుర్తించారు. కన్పించకుండా పోయిన బాలుడు అతడేనని నిర్ధారించుకున్న తర్వాత అతడి కుటుంబానికి సమాచారమిచ్చారు. ప్రస్తుతం అతడు నాంపల్లి అధికారుల సంరక్షణలో ఉన్నాడు. పరిణవ్‌ను తీసుకెళ్లేందుకు అతడి తల్లిదండ్రులు హైదరాబాద్‌ బయల్దేరారు. కుమారుడి ఆచూకీ కనుగొనేందుకు సాయం చేసిన సోషల్‌ మీడియా యూజర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు