Sudha Murty: నా కుమార్తె వల్లే రిషిసునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారు: సుధామూర్తి

వితరణశీలిగా దేశప్రజలకు సుపరిచితులైన సుధామూర్తి తన కుమార్తె అక్షతా మూర్తి, బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె వల్లే రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు.

Published : 28 Apr 2023 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రచయిత్రి, విద్యావేత్త, వితరణశీలిగా సుపరిచితులైన సుధామూర్తి (Sudha Murty).. తన కుమార్తె అక్షతా మూర్తి, బ్రిటన్‌ ప్రధాని (UK), అల్లుడు రిషిసునాక్‌ (Rishi Sunak) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భర్త విజయంలో భార్య కీలక పాత్ర పోషిస్తుందని, తన కుమార్తె వల్లే రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆమె ఈ విధంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో సుధామూర్తి.. ‘‘భార్య మహిమ భర్తను ఎలా మార్చగలదో చూడండి. నేను నా భర్తను వ్యాపారవేత్తగా మార్చాను. నా కుమార్తె తన భర్తను బ్రిటన్‌ ప్రధానమంత్రిని చేసింది’’ అని పేర్కొన్నారు. సుధామూర్తి ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తి సతీమణి. వారి కుమార్తె అక్షతా మూర్తి (Akshata Murty)ని రిషిసునాక్‌ 2009లో వివాహం చేసుకున్నారు. డిజైనర్‌గా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అక్షత వివిధ కారణాల రీత్యా తన సంస్థ అక్షతా డిజైన్స్‌ను మూసివేసి.. తన తండ్రి వ్యాపారంపై దృష్టి పెట్టారు. తన తండ్రి స్థాపించిన వెంచర్‌ క్యాపిటల్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు తన తండ్రి కంపెనీ ఇన్ఫోసిస్‌లోనూ ఆమెకు 0.93% విలువ గల షేర్లున్నాయి. ఇంకోవైపు.. తన సోదరుడు ప్రారంభించిన ఫిట్‌నెస్‌ కంపెనీకి కూడా డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సుధామూర్తి పలు అనాథాశ్రమాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని