Nepal: ప్రధాని పదవిపై రగడ.. పార్లమెంట్‌ రద్దు

హిమాలయ దేశం నేపాల్‌ మరోసారి రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్లమెంట్‌లో బలం తమకే ఉందంటూ ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత కూడా ప్రకటించారు. అయితే

Published : 22 May 2021 09:41 IST

కాఠ్‌మాండూ: హిమాలయ దేశం నేపాల్‌ మరోసారి రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్లమెంట్‌లో బలం తమకే ఉందంటూ ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత కూడా ప్రకటించారు. అయితే వీరిద్దరి ప్రకటనలను తిరస్కరించిన అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి పార్లమెంట్‌ను రద్దు చేశారు. వచ్చే నవంబరులో సాధారణ ఎన్నికలు జరపాలని ఆదేశించారు. 

శుక్రవారం అర్ధరాత్రిలోగా కొత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలు భండారి గడువు పెట్టారు. అయితే ప్రధాని ఓలి, ప్రతిపక్ష నేత దేవుబా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో విఫలమైనందున పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు ఓ ప్రకటనలో తెలిపారు. నవంబరు 12న తొలి విడత, నవంబరు 19న రెండో దశలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

తనకు 153 మంది సభ్యుల మద్దతు ఉందంటూ ప్రధాని కె.పి శర్మ ఓలి ప్రకటించారు. ఈ మేరకు ఆయన నిన్న అధ్యక్షురాలు భండారికి వినతి పత్రం సమర్పించారు. సొంత పార్టీ సీపీఎన్‌-యూఎంఎల్‌కు చెందిన 121 మంది, జనతా సమాజ్‌బాదీ పార్టీ నేపాల్‌కు చెందిన 32 మంది మద్దతు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు నేపాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దేవుబా కూడా అధ్యక్షురాలి వద్దకు వెళ్లి తనకు 149 మంది మద్దతు ఉందని చెప్పారు. నేపాల్‌ పార్లమెంట్‌లో 275 మంది సభ్యులు ఉండగగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం. 

ఓలి అంతకుముందు పార్లమెంట్‌ను రద్దు చేయగా.. అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దగ్గర నుంచి రాజకీయ సంక్షోభం ముదిరింది. బలపరీక్షలో ఆయన ఓడిపోయినప్పటికీ ప్రత్యామ్నాయంగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయనే ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని