
Corona vaccine: టీకా తీసుకోలేదా.. అయితే ఉద్యోగం గోవిందా
ఏ దేశ ప్రభుత్వం నిర్ణయమంటే..
వెల్లింగ్టన్: కరోనా కట్టడి విషయంలో ప్రారంభం నుంచి న్యూజిలాండ్ ఎంత అప్రమత్తంగా ఉందో తెలిసిందే. ఆగస్టులో ఒక్క కొవిడ్ కేసు నమోదయ్యేసరికి దేశవ్యాప్తంగా మూడు రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు ప్రధాని జెసిండా ఆర్డెర్న్. సోమవారం ఇలాంటి కఠిన నియమనిబంధననే మరోసారి ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. ‘‘టీకా తీసుకోకపోతే ఉద్యోగం ఉండదు’’ అంటూ అక్కడి హెల్త్‌కేర్ వర్కర్స్‌తో పాటు ఉపాధ్యాయులను హెచ్చరించింది. ఈమేరకు అక్కడి విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్ మాట్లాడుతూ.. ‘‘ కరోనాను కట్టడి చేయాలంటే ఒకటే మార్గం. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించేది లేదు. కచ్చితంగా టీకా తీసుకోవాల్సిందే. డిసెంబరు1 నాటికి డాక్టర్లు, నర్సులతో పాటు ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇక విద్యార్థులకి పాఠాలు బోధించే ఉపాధ్యాయులతో పాటు విద్యారంగంలో ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా రెండుడోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇదే విషయంపై అక్కడి రాయల్ న్యూజిలాండ్ కాలేజీ ప్రెసిడెంట్ సమంత మర్టన్ మాట్లాడుతూ.. ‘‘ఇది కాస్త కఠినంగా అనిపించినప్పటికీ, ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా’’ అని అన్నారు. ఆగస్టులో డెల్టా వేరియంట్ కేసు నమోదవ్వడానికి ముందు.. న్యూజిలాండ్‌లో వైరస్‌వ్యాప్తి లేకుండా తీసుకున్న జాగ్రత్త చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందాయి. ఓపక్క అగ్రరాజ్యం అమెరికా, చైనా, భారత్‌లో భారీగా కరోనా కేసులు నమోదవుతుంటే ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తమదేశాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటిది ఒక్క డెల్టా కేసు కారణంగా ‘‘కొవిడ్ జీరో’’ కాస్త నెమ్మదించింది. న్యూజిలాండ్‌లో అధిక జనాభాగల అక్లాండ్‌లో డెల్టా కేసు నమోదైనప్పటి నుంచి న్యూజిలాండ్ కొవిడ్ నియంత్రణపై మరింత దృష్టి సారించింది.