Ipsos Study: ఆరోగ్య సదుపాయాలపై సంతృప్తి.. కానీ.. క్యాన్సర్ ముప్పుపైనే ఆందోళన..!

నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ (Quality ealthcare) అందుబాటులో ఉందని భారత్‌లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు పేర్కొన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 20 Oct 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ (Quality ealthcare) అందుబాటులో ఉందని భారత్‌లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు పేర్కొన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్‌ అతిపెద్ద ఆరోగ్య ముప్పుగా ఎక్కువ మంది (59శాతం) భావిస్తున్నట్లు తెలిపింది. కాగా.. అంతర్జాతీయంగా మాత్రం మానసిక ఆరోగ్యంపైనే (Mental health) ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తాజా నివేదికలో తేలింది.

ఆరోగ్య సంరక్షణ సదుపాయాలపై ఇప్సోస్‌ గ్లోబల్‌ హెల్త్‌ సర్వీస్‌ మానిటరింగ్‌ 2023 అధ్యయనం నిర్వహించింది. 31 దేశాల్లో 23,274 మందిని సర్వే చేసింది. తమ దేశంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని సింగపూర్‌లో 71 శాతం, స్విట్జర్లాండ్‌లో 68 శాతం, మలేసియాలో 66 శాతం మంది వెల్లడించారు. పోలాండ్‌, హంగేరీ, పెరూ దేశాల్లో మాత్రం స్థానికులు అక్కడి సదుపాయాలపై తక్కువ రేటింగ్‌ ఇచ్చారు.

  • క్యాన్సర్‌ ముఖ్యమైన ఆరోగ్య ముప్పు అని భారత పట్టణ ప్రాంతాల్లోని అత్యధిక (59 శాతం) ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గుండె సమస్యలు (39 శాతం), మధుమేహం (35 శాతం), కొవిడ్‌-19 (27 శాతం), మద్యపానం (26 శాతం), ధూమపానం (20 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • భారత్‌లో ఆరోగ్య సంరక్షణలో నాణ్యత లేని చికిత్స (30 శాతం), చికిత్సకు భారీ ఖర్చు (29 శాతం), శుభ్రత లేకపోవడం (27 శాతం), సిబ్బంది కొరత (26 శాతం), భద్రత లేకపోవడం (21 శాతం), మరో అవకాశం లేకపోవడం (21 శాతం) వంటి సవాళ్లు ఎదురవుతున్నట్లు సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు.
  • అంతర్జాతీయంగా ప్రజారోగ్య సమస్యల్లో మొదటగా మానసిక ఆరోగ్యం (44 శాతం) నిలిచింది. క్యాన్సర్‌ (40 శాతం), ఒత్తిడి (30 శాతం), ఊబకాయం (25 శాతం), ఔషధ దుర్వినియోగం (22 శాతం), మధుమేహం (18 శాతం), మద్యం (17 శాతం), గుండె వ్యాధులు (15 శాతం), కొవిడ్ (15 శాతం)గా ఉన్నాయి.
  • ఈ అధ్యయనం ప్రకారం, సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం (అంతర్జాతీయంగా) ప్రజలు తమకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాగా 53 శాతం భారతీయులు ఆరోగ్య సదుపాయాలపై ఇదే విధమైన అభిప్రాయాలను వెల్లడించారు.
  • ఆరోగ్య సంరక్షణ సదుపాయాల్లో సమానత్వం (Equality) ఉందని భారత్‌ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది చెప్పారు. ఇలా చెప్పడం ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధికం. మలేసియాలో 65 శాతం, స్పెయిన్‌లో 64 శాతం, సింగపూర్‌లో 61 శాతం మంది ఇలా భావిస్తున్నట్లు వెల్లడించారు.
  • దేశ ఆరోగ్య వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నట్లు 75 శాతం మంది పట్టణ భారతీయులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసిన దేశాల్లో ఇదే అత్యధికం. సింగపూర్‌ 69 శాతం, స్పెయిన్‌ 69 శాతం, మలేసియా 68 శాతం ప్రజల నుంచి మాత్రమే ఇటువంటి అభిప్రాయం వ్యక్తమైంది.
  • డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ పొందడంలోనూ భారత్‌ ముందుంది. ఈ ప్రక్రియ చాలా తేలిక అని సర్వేలో పాల్గొ్న్న వారిలో 70 శాతం మంది భారతీయులు అంగీకరించారు. దక్షిణాఫ్రికా 64 శాతం, మలేసియా 61 శాతం, దక్షిణాఫ్రికా 61 శాతం, సింగపూర్‌లో 60 శాతం మంది ఇలా చెప్పారు. కాగా.. అంతర్జాతీయంగా ఇది కేవలం 46 శాతమే.
  • భారత్‌లో ప్రపంచస్థాయి ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉందని.. ముఖ్యంగా మెడికల్‌ టూరిజానికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోందని ఇప్సోస్‌ ఇండియా ప్రతినిధి గౌరీ పాఠక్‌ పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు