దీప్‌ సిద్ధూ ఎక్కడున్నాడో చెప్తే...

పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ, మరో ముగ్గురి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు బుధవారం దిల్లీ పోలీసులు ప్రకటించారు.

Updated : 03 Feb 2021 16:16 IST

రూ.లక్ష రివార్డు ప్రకటించిన దిల్లీ పోలీసులు

దిల్లీ: పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ, మరో ముగ్గురి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు బుధవారం దిల్లీ పోలీసులు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ దేశరాజధానిలో ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆ ఘటనలకు సంబంధించి వారు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారితో పాటు ఆ రోజు జరిగిన హింసలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్‌బీర్ సింగ్, బూటా సింగ్, సుఖదేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్‌పై మరో రూ.50వేల రూపాయలను రివార్డుగా ప్రకటించారు.

జనవరి 26న జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు దీప్ సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు రైతుల జెండా ఎగురవేసిన సమయంలో సిద్ధూ అక్కడే ఉన్నారు. జెండాలు ఎగురవేయడాన్ని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు కూడా చేశారు. అల్లర్లకు సిద్ధూనే బాధ్యుడంటూ రైతు సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే, ఆ ఘటన తర్వాత నుంచి సిద్ధూ కనిపించకపోవడం గమనార్హం. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

అంతేకాకుండా ఆ ఉద్రిక్తతలకు కారకులుగా భావిస్తోన్న 12 మంది చిత్రాలను విడుదల చేశారు. ఆ 12 మంది చేతిలో కర్రలు, లాఠీలు ఉన్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోందని, ఎర్రకోట వద్ద ఘర్షణలకు వారు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు 44 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 122 మందిని అరెస్టు చేశారు. ఆ హింసలో ఓ రైతు మరణించగా.. ఆయన మృతికి సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో కొందరు పాత్రికేయులు, ప్రతిపక్షపార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు. 

ఇవీ చదవండి:

ఆ భయంతోనే తిరుగుబాటు?

బెంగళూరులో యుద్ధ విమానాల విన్యాసాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని