Modi: ఆరోజు అర్ధరాత్రి ప్రధాని మోదీ నాకు ఫోన్‌ చేసి..

సంక్షోభ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించే తీరు చాలా గొప్పగా ఉంటుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు.

Published : 23 Sep 2022 12:39 IST

2016 నాటి ఘటనను గుర్తుచేసుకున్న జైశంకర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్షోభ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించే తీరు చాలా గొప్పగా ఉంటుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. తన నాయకత్వ ప్రతిభతో ఎన్నో సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించారని కొనియాడారు. ప్రస్తుతం జైశంకర్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్‌లో ‘మోదీ@20: డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్నేళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను గుర్తుచేసుకున్నారు.

‘‘2016లో అఫ్గానిస్థాన్‌లోని మజర్‌-ఇ-షరీఫ్‌లో గల భారత దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. అప్పుడు నేను విదేశాంగ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా. దాడి విషయం మాకు అర్ధరాత్రి సమయంలో తెలిసింది. దీంతో మేం వెంటనే అక్కడి అధికారులకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించాం. అదే సమయంలో ప్రధానమంత్రి నాకు స్వయంగా ఫోన్‌ చేశారు. అప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న - ‘మెలకువగానే ఉన్నారా?’ అని. నేను అవునని చెప్పి.. జరిగిన ఘటన నుంచి ప్రధానికి అప్‌డేట్‌ చేశా. భారత్‌ నుంచి అవసరమైన సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పాను. అప్పుడు మోదీ.. ‘పూర్తయ్యాక నాకు కాల్‌ చేయండి’ అని చెప్పారు. అయితే దానికి రెండు, మూడు గంటలు పడుతుందని, పీఎంవో కార్యాలయానికి ఫోన్‌ చేస్తానని చెప్పాను. దీనికి మోదీ స్పందిస్తూ.. ‘నాకే ఫోన్‌ చేయండి’ అని అన్నారు. ఈ ఒక్క మాట చాలు.. ఆయనలోని అసాధారణ నాయకత్వ లక్షణాన్ని చెప్పడానికి’’ అని జైశంకర్‌ నాటి సంఘటనను పంచుకున్నారు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రధాని ఎల్లప్పుడూ వెంటే ఉంటారని, అది ఆయన గొప్పతనమని మంత్రి కొనియాడారు. తనకు తెలియని విషయాలను కూడా అడిగి తెలుసుకుంటారని, అందుకు ఏ మాత్రం సందేహించరని తెలిపారు. అవసరమైతే ఎదుటివారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోడానికి కూడా ప్రధాని వెనుకాడరని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని