PM Modi: సందేశ్‌ఖాలీ కేసు వివాదం.. టీఎంసీపై మోదీ ఫైర్‌

Sandeshkhali Incident: సందేశ్‌ఖాలీ మహిళల ఆందోళనను నిర్లక్ష్యం చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌పై యావత్‌ దేశం ఆగ్రహంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ కేసు నుంచి నిందితుడిని కాపాడేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేసిందని దుయ్యబట్టారు.

Published : 01 Mar 2024 17:15 IST

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు. హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ (Sandeshkhali incident) కేసును ప్రస్తావించారు. ఈసందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీపైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

‘‘సందేశ్‌ఖాలీ సోదరీమణులపై టీఎంసీ నేత పాల్పడిన అఘాయిత్యాలను చూసి యావత్ దేశం ఆగ్రహించింది. ఈ ఘటన సిగ్గుచేటు. ఇలాంటి దారుణాలను చూసి సంఘ సంస్కర్త రాజారామ్మోహన్‌రాయ్‌ ఆత్మ ఘోషించి ఉంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ నేత (షేక్‌ షాజహాన్‌) అన్ని హద్దులూ దాటాడు. అయినా, రెండు నెలల పాటు అరెస్టు చేయలేదు. అతన్ని కేసు నుంచి కాపాడేందుకు తృణమూల్‌ తీవ్రంగా ప్రయత్నించింది’’ అని మోదీ దుయ్యబట్టారు.

సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ అరెస్ట్‌

ఈసందర్భంగా విపక్షాల ‘ఇండియా కూటమి’పైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. ‘‘సందేశ్‌ఖాలీ దారుణాలపై ప్రతిపక్షాల కూటమి మౌనంగా ఉండటం సిగ్గుచేటు. అవినీతిపరులకు అండగా ఉండటం, బుజ్జగింపు రాజకీయాలే వారికి ప్రథమ ప్రాధాన్యం’’ అని ధ్వజమెత్తారు. బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేయకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని మండిపడ్డారు. వారి రాజకీయాల కారణంగా పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అవినీతి నేతలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నందన్న వల్లే టీఎంసీ తనపై ఆగ్రహంగా ఉందన్నారు. అధికారం నుంచి వారికి వీడ్కోలు పలికేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ ఓటమి ఖాయమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని