PM Modi: నా యూట్యూబ్‌ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి.. అప్‌డేట్‌ల కోసం బెల్‌ ఐకాన్‌ నొక్కండి: ప్రధాని మోదీ

యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తాను కూడా యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లలో ఒకరినని, వారికి తాను ఏమాత్రం భిన్నం కాదని పేర్కొన్నారు. ప్రజల్లో స్ఫూర్తి రగిలించేలా వీడియోలు చేయాలని సూచించారు. 

Updated : 28 Sep 2023 04:37 IST

దిల్లీ: మనకు తెలియని విషయం కోసం గూగుల్‌(Google)పై ఎంత ఆధారపడతామో, విషయ పరిజ్ఞానం కోసం యూట్యూబ్‌(YouTube)ను అంతే ఆదరిస్తాం. ఇక యూట్యూబ్‌లో మనం తరుచుగా వినేమాట.. ‘‘ఈ సమాచారం నచ్చినట్లైతే లైక్‌ చేయండి, షేర్‌ చేయండి, మా ఛానల్‌ను ఇంతవరకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. మరిన్ని అప్‌డేట్‌ల కోసం బెల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి’’. యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రమోట్ చేసేందుకు కొత్తగా ఛానల్‌ను ప్రారంభించినవారు, తక్కువ సబ్‌స్క్రైబర్‌లు ఉన్న వారు తరుచుగా యూజర్లను సబ్‌స్క్రైబ్‌ చేసుకోమని కోరుతారు. ఇది సాధారణమే అయినప్పటికే భారత ప్రధాని మోదీ(PM Modi) సైతం తన యూట్యూబ్‌ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోమని చెప్పడం ఆసక్తికరంగా మారింది. 

యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా బుధవారం 5,000 మంది సమాచార సృష్టికర్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. తాను కూడా మీలో ఒకరినని, తాను ఏమాత్రం భిన్నం కాదన్నారు. సమాచార సృష్టిలో తాను వారిలో ఒకరినని భావించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత 15 ఏళ్ల నుంచి యూట్యూబ్‌ ద్వారా దేశానికి, ప్రపంచానికి అనుసంధానమైనట్లు ప్రధాని చెప్పారు. తనకు కూడా మంచి సంఖ్యలోనే సబ్‌స్క్రైబర్లు ఉన్నారని పేర్కొన్నారు. విషయ పరిజ్ఞానం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గత కొద్ది ఏళ్లుగా తాను గమనిస్తున్నట్లు చెప్పారు. మనమంతా కలిసి దేశ వ్యాప్తంగా పలు మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. తన ఛానల్‌లో వేల కొద్ది వీడియోలు ఉన్నప్పటికీ, విద్యార్థులు పరీక్ష సమయంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉత్పాదకత పెంపు, మేనేజ్‌మెంట్‌ వంటి వాటి గురించి యూట్యూబ్‌ ద్వారా విద్యార్థులతో సంభాషించడం తనకు సంతృప్తినిస్తాయని తెలిపారు. 

ఐదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్వచ్ఛ్‌ భారత్‌, డిజిటల్‌ పేమెంట్స్‌, ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’పై మాట్లాడారు. ఇలాంటి ప్రచారాల్లో మరింత మంది ప్రజలను భాగం చేసేలా స్ఫూర్తి తీసుకురావాలని తన తోటి యూట్యూబర్లను కోరారు. మన దేశ శ్రామికులు, కళాకారుల చేతుల్లో తయారై, మన నేల సువాసన తగిలిన వస్తువుల్ని కొనేలా, తద్వారా జాతిని మేల్కొల్పే ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రజలకు ఒక భావోద్వేగపూరిత విజ్ఞప్తిని చేయండంటూ యూట్యూబర్లను కోరారు. ఇక యూట్యూబర్లు తమ ప్రతి వీడియో చివర్లో ప్రజలు ఆలోచించేలా ప్రశ్నలను లేవనెత్తడం, కార్యాచరణకు సంబంధించిన వాటిని వారి ముందు ఉంచడం లాంటివి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా వారు మీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారన్నారు. దీంతో యూట్యూబర్ల పాపులారీటీ సైతం పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రజలు ఏదైనా చేయడానికి ముందుకొస్తారని చెప్పారు. ఇక వీడియో చివరలో తన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని, అప్‌డేట్‌ల కోసం బెల్‌ ఐకానును నొక్కాలని నెటిజన్లను ప్రధాని మోదీ కోరడం విశేషం. 

ఫేస్‌బుక్‌(Facebook), ఎక్స్‌(X)(ట్విటర్‌) వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి విశేష ఆధరణ ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ఎందరో దేశాధినేతలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీని ట్విటర్‌(ఎక్స్‌)లో 9.2 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.8 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇక యూట్యూబ్‌లో ప్రధాని మోదీ ఛానల్‌కు 1.79 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని