Vande Bharat: మరో వందే భారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మరో వందే భారత్‌ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు వారణాసి- దిల్లీ మధ్య సర్వీసులందించనుంది.

Published : 18 Dec 2023 15:28 IST

Vande Bharat Express | వారణాసి:  ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటన కొనసాగుతోంది. తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వారణాసి నుంచి దిల్లీకి మరో కొత్త వందేభారత్‌ రైలు (Vande Bharat Express)ను ప్రధాని ప్రారంభించారు. అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. అలాగే, పలు గూడ్స్‌ రైళ్లను సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

వారణాసి- దిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక Vande Bharat Express రైలు నడుస్తుండగా.. ఇది రెండోది. ఈ రైలులో వైఫై సేవలతో పాటు GPS-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, డిఫ్యూజ్డ్ LED లైటింగ్, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, టచ్‌ బేస్డ్‌ రీడింగ్‌ లైట్లు వంటి అధునాతన సౌకర్యాలు ఈ రైలులో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ వందే భారత్‌ సెమీ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీసులందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 34 రైళ్లు ఉండగా.. తాజా రైలుతో మొత్తం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య 35కి చేరింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం.. వారణాసిలో ప్రారంభించిన మోదీ

ఈ రైలు మంగళవారం మినహా మిగతా ఆరు రోజుల్లో ఉదయం 6గంటలకు వారణాసిలో బయల్దేరి మధ్యాహ్నం 2.05 గంటలకు దిల్లీకి చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు దిల్లీ నుంచి బయల్దేరి రాత్రి 11.05 గంటలకు తిరిగి వారణాసికి చేరుకుంటుంది. అలాగే, దేశంలోని తొలిసారి 2019 ఫిబ్రవరిలో మొదలైన వందే భారత్‌ రైలు గురువారం మినహా  దిల్లీలో ప్రతిరోజూ ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2గంటలకు వారణాసి చేరుకుంటుండగా.. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు వారణాసిలో బయల్దేరి రాత్రి 11గంటలకు తిరిగి దిల్లీకి చేరుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని