Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో 2 రైళ్లు సహా ఈ నెల 24న 9 వందేభారత్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా వాటిని ప్రారంభించానున్నారు.

Published : 23 Sep 2023 01:47 IST

Vande Bharat Express | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఒకేసారి 9 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (Vande Bharat Express) ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా వీటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రైళ్లు అందుబాటులో ఉండగా.. కొత్తగా వచ్చే వాటితో కలిసి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సంఖ్య 34కు చేరనుంది. తాజాగా ప్రారంభించే 9 రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 2 రైళ్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఒకటి కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తుంది. బుధవారం మినహా ఆరు రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. విజయవాడ-చెన్నై మధ్య నడిచే సర్వీసు మంగళవారం ఉండదు.  

ఇక మిగిలిన 7 రైళ్ల విషయానికొస్తే పశ్చిమ బెంగాల్‌కు కొత్తగా రెండు వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. పట్నా- హావ్‌డా, రాంచీ-హావ్‌డా మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. చెన్నై ఎగ్మోర్‌ - తిరునెల్వేలి;  రవుర్కెలా- పూరీ; కాసర్‌గోడ్‌- తిరువనంతపురం; ఉదయ్‌పుర్‌-జైపుర్‌; జామ్‌నగర్‌-అహ్మదాబాద్‌ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగించనున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో ట్రైల్‌రన్‌లను రైల్వే శాఖ పూర్తి చేసింది.

వచ్చే ఏడాదే వందే భారత్‌ స్లీపర్‌, వందే మెట్రో

స్టేషన్లు ఇవే..

కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) మధ్య రాకపోకలు సాగించే వందే భారత్‌ రైలు.. కాచిగూడలోఉదయం 5.30కు బయలుదేరి మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరిగి 2.45కు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుకుంటుంది. 

విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. విజయవాడలో 5.30కు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళతాయి. ఈ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుంది.

ప్రత్యేకతలు ఇవే..

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నెల 24న పట్టాలు ఎక్కనున్న రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సౌకర్యాలను రైల్వేశాఖ మెరుగుపరిచింది. మొత్తం 25 రకాల మార్పులు చేశామంది. సీట్లలో ఎనిమిదిన్నర గంటలపాటు కూర్చోవాల్సి వస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. వారు మరింత వెనక్కి వాలి నిద్రపోయేలా పుష్‌బ్యాక్‌ను, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ను, ఫుట్‌రెస్ట్‌ను మెరుగుపరిచారు. మరుగుదొడ్లలో వెలుతురును, వాష్‌బేసిన్ల లోతును పెంచారు. ఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో మార్పులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని