PM security breach: మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. 23 నెలల తర్వాత ఆ ఎస్పీపై వేటు

PM security breach: ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న ఘటనలో ఓ ఎస్పీని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనలో దాదాపు 23 నెలల తర్వాత ఆ పోలీసు అధికారిపై వేటు పడటం గమనార్హం.

Published : 25 Nov 2023 17:46 IST

చండీగఢ్‌: దాదాపు రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) పంజాబ్‌ (Punjab) పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం (security breach) తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బఠిండా జిల్లా ఎస్పీ గుర్బీందర్‌ సింగ్‌పై వేటు పడింది. ఈ మేరకు ఆయనను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్‌ చేస్తూ పంజాబ్ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన సమయంలో ఆయన ఫిరోజ్‌పుర్‌ (Ferozepur) ఎస్పీగా ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఇటీవల రాష్ట్ర డీజీపీ.. హోంశాఖకు నివేదిక సమర్పించారు. ప్రధాని పర్యటన సమయంలో ఫిరోజ్‌పుర్‌లో విధుల్లో ఉన్న గుర్బీందర్‌ సింగ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తమ దర్యాప్తులో డీజీపీ వెల్లడించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం సింగ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు హోంశాఖ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.

‘తేజస్‌’ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ..

2022 జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బఠిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌ వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో బయల్దేరారు. అయితే, మరో 30 నిమిషాల్లో గమ్యస్థానం సమీపిస్తుందనగా.. మోదీ వాహనశ్రేణి ఓ పైవంతెనకు చేరుకుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వందల మంది రైతులు ఆ మార్గాన్ని దిగ్బంధించారు. దీంతో దాదాపు 20 నిమిషాలు ప్రధాని, ఆయన కాన్వాయ్‌ బ్రిడ్జ్‌పైనే చిక్కుకుపోయింది. పరిస్థితి ఎంతకీ మెరుగుపడకపోవడంతో ప్రధాని అక్కడి నుంచి వెనుదిరిగారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర సంచలనం రేపింది. దీనిపై గతేడాది జనవరి 12న సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఈ కమిటీ.. పోలీసుల విధి నిర్వహణలో లోపాలున్నట్లు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని