Vande Bharat Express: రైల్వే బిగ్‌ ప్లాన్‌.. వచ్చే ఏడాదికి 500 వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat Express: వచ్చే ఏడాది వందే భారత్‌ రైళ్లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 500కు పైగా రైళ్లు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

Published : 09 Nov 2023 19:47 IST

Vande Bharat Express | ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వందే భారత్‌ రైళ్లు (Vande Bharat Express) ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 30కి పైగా రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో స్లీపర్‌ క్లాస్‌ బోగీలతో కూడిన వందే భారత్‌ రైళ్లు కూడా త్వరలో రానున్నాయి. అయితే, వచ్చే ఏడాది కల్లా భారీ సంఖ్యలో వందే భారత్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. 500కు పైగా రైళ్లు వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివరాలు పేర్కొన్నారు.

వచ్చే ఏడాది కల్లా 500 నుంచి 550 వందే భారత్‌ రైళ్లను తీసుకురావాలని ఐసీఎఫ్‌ లక్ష్యంగా పెట్టుకుందని మాల్యా తెలిపారు. ఈ ఏడాది మొత్తం 75 వందే భారత్‌ రైళ్లు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అందులో 8 కార్‌ వెర్షన్‌వి 63.. 16 కార్‌ వెర్షన్‌వి 13 ఉన్నాయని చెప్పారు. అలాగే, రైలు ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రయాణికులకు గాయాల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మాల్యా తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు దశలవారీగా 25 రైళ్లను ప్రారంభించిన రైల్వే శాఖ.. తాజాగా ఒకేసారి 9 రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-చెన్నై రైళ్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని