Rajasthan: ‘బాల్య వివాహాల’ నమోదుపై విమర్శలు.. బిల్లుపై వెనక్కి తగ్గిన రాజస్థాన్‌

బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేందుకు అవకాశమిచ్చేలా రాజస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి.

Published : 12 Oct 2021 11:02 IST

జైపూర్‌: బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేందుకు అవకాశమిచ్చేలా రాజస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. దీంతో వెనక్కి తగ్గిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది. అసలేం జరిగిందంటే..

రాష్ట్రంలో జరిగే అన్ని వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసేలా ఇటీవల రాజస్థాన్‌ ప్రభుత్వం కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మ్యారేజీ(సవరణ) బిల్లును రూపొందించింది. సెప్టెంబరు 17న ఈ బిల్లును అక్కడి శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదముద్ర కూడా పడింది. అయితే ఇంకా చట్టరూపం దాల్చలేదు. అయితే ఈ బిల్లులోని ఓ క్లాజ్‌ ప్రకారం.. ‘‘వధువు వయసు 18ఏళ్లు లోపు, వరుడి వయసు 21 ఏళ్ల లోపు ఉంటే వారి తల్లిదండ్రులు 30 రోజుల లోగా తమ పిల్లల పెళ్లిని తప్పనిసరిగా నమోదు చేయాలి’’ అని ఉంది. అంటే.. బాల్య వివాహామైనా కూడా తల్లిదండ్రుల అనుమతి ఉంటే వాటిని చట్టబద్ధం చేయొచ్చన్నమాట. దీంతో ఇది కాస్తా తీవ్ర వివాదానికి తెరతీసింది.

ఈ బిల్లుపై ప్రతిపక్ష భాజపా సహా హక్కుల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు బాల్య వివాహాలను అరికట్టాలని దేశమంతా ఉద్యమాలు జరుగుతుంటే.. రాజస్థాన్‌ ప్రభుత్వం మాత్రం వాటికి చట్టపరంగా అనుమతి కల్పిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బిల్లు బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. దీనిని ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో సవాల్‌ కూడా చేసింది. దీంతో ఈ వివాదాస్పద బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 

‘‘వివాహాలను చట్టబద్ధం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చాం. అయితే ఇందులోని కొన్ని నిబంధలను బాల్య వివాహాలను సమర్థించేలా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బిల్లును వెనక్కి పంపాలని గవర్నర్‌ను కోరాం. దీనిపై న్యాయపరమైన సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణ చేపడతాం. బాల్య వివాహాలపై మా ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడదు. వాటిని నిర్మూలించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం’’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ వెల్లడించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున రాజస్థాన్‌ ఈ బిల్లును వెనక్కి తీసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని