Chidambaram: రూ.2వేల నోట్ల మార్పిడి.. వారికి రెడ్‌కార్పెట్‌ వేసినట్లే..: చిదంబరం

Rs.2,000 Notes Exchange: రూ.2వేల నోటును ప్రవేశపెట్టడం తెలివితక్కువ చర్య అని, అది కేవలం నల్లధనం దాచుకునేవారికి మాత్రమే సహాయపడిందని కాంగ్రెస్‌ నేత చిదంబరం (Chidamabaram) మండిపడ్డారు. ఇప్పుడు ఈ నోట్ల మార్పిడితో భాజపా అసలు ఉద్దేశం బయటపడిందన్నారు.

Published : 22 May 2023 13:39 IST

దిల్లీ: ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) చేసిన ఆకస్మిక ప్రకటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ చర్యను మరో డీమానిటైజేషన్‌గా అభివర్ణిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం (P Chidambaram) స్పందిస్తూ.. ఈ నోట్ల మార్పిడితో నల్లధనం (Black Money) దాచుకున్నవారికి రెడ్‌కార్పెట్‌ వేసినట్లే అని మండిపడ్డారు. అసలు రూ.2వేల నోటును తీసుకురావడమే ఓ తెలివితక్కువ చర్య అని దుయ్యబట్టారు.

‘‘ఎలాంటి పత్రాలు నింపకుండా, ఎలాంటి గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా తమ శాఖల్లోకి వెళ్లి రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చని బ్యాంకులు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే.. నల్లధనాన్ని వెలికితీసేందుకే ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భాజపా (BJP) చేస్తున్న వాదన తప్పనే కదా..! సామాన్య ప్రజల వద్ద రూ.2వేల నోట్లు లేవు. 2016లో ఈ నోట్లను ప్రవేశపెట్టిన కొద్దికాలంలోనే ప్రజలు వాటిని ఉపయోగించడం మానేశారు. రోజువారీ అవసరాలకు వారికి ఈ నోట్లు పనికిరావు. అప్పుడు వీటిని ఎవరు వినియోగిస్తున్నారు? ఎవరు దాచిపెట్టుకున్నారు? సమాధానం మీకు తెలుసు. కేవలం నల్లధనాన్ని (Black Money) దాచుకునేవారి సౌలభ్యం కోసం మాత్రమే ఈ రూ.2వేల నోటు ఉపయోగపడింది. ఇప్పుడు బ్యాంకుల నిర్ణయంతో నల్లధనం కలిగిన వారు తమ నోట్లను మార్చుకునేందుకు రెడ్‌కార్పెట్‌ వేసి ఆహ్వానం పలుకుతున్నారు. నల్లధనాన్ని సమూలంగా వెలికితీస్తామన్న కేంద్రం లక్ష్యం వెనుక ఇంకేదో ఉంది. రూ.2వేల నోటును తీసుకొస్తూ 2016లో తీసుకున్న నిర్ణయమే తెలివితక్కువ చర్య. కనీసం ఏడేళ్ల తర్వాతనైనా ఆ మూర్ఖపు చర్యను వెనక్కి తీసుకున్నందుకు సంతోషం’’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై చిదంబరం (P Chidambaram) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

రూ.2000 నోట్లను (Rs.2000 notes) ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ (RBI) గత శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో వీటిని మార్చుకునేందుకు 2023 సెప్టెంబరు 30 వరకు గడువిచ్చింది. రేపటి నుంచి నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, రూ.2,000 నోట్లను ఒక్కోసారి రూ.20 వేల విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా, గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా తమ శాఖల్లో మార్చుకోవచ్చని పలు బ్యాంకులు ఇప్పటికే ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే చిదంబరం స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని