Corona: రష్యాలో రికార్డుస్థాయి మరణాలు!

రష్యాలో వైరస్‌ ఉద్ధృతి మరోసారి పెరిగింది. కేవలం నిన్న ఒక్కరోజే అక్కడ రికార్డుస్థాయిలో 652 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి.

Published : 29 Jun 2021 22:03 IST

ఒక్కరోజే 652 మంది కరోనా బాధితులు మృతి

మాస్కో: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చింది. ఇదే సమయంలో మరికొన్ని దేశాల్లో మాత్రం మరోసారి విజృంభిస్తోంది. తాజాగా రష్యాలోనూ వైరస్‌ ఉద్ధృతి పెరిగినట్లు కనిపిస్తోంది. కేవలం నిన్న ఒక్కరోజే అక్కడ రికార్డుస్థాయిలో 652 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. కొవిడ్‌-19 వెలుగు చూసిన తర్వాత రష్యాలో ఒకేరోజు ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గడిచిన వారం రోజులుగా రష్యాలోనూ నిత్యం 20వేల పాజిటివ్‌ కేసులు, 600లకు పైగా మరణాలు నమోదవుతున్నట్లు అక్కడి కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. కేవలం మంగళవారం ఒక్కరోజే 20,616 పాజిటివ్‌ కేసులు బయటపడగా.. 652 మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడినట్లు తెలిపింది. దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత ఈ తరహాలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

కేవలం 14శాతం మందికి టీకా..

అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరప్‌ దేశాల్లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. దీంతో అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గడంతోపాటు కొవిడ్‌ మరణాలు అదుపులోకి వచ్చాయి. కానీ, ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ విడుదల చేసిన దేశంగా ప్రకటించుకున్న రష్యాలో మాత్రం.. ఇప్పటివరకు కేవలం 14శాతం మంది ఒక డోసు తీసుకున్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చడానికి వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా కొనసాగకపోవడమే కారణమని అక్కడి నిపుణులు విశ్లేషిస్తున్నారు. జూన్‌ నెలలోనే వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నట్లు కనిపించినప్పటికీ వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ రేటు తగ్గడం, కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్‌లపై అప్రమత్తం కాకపోవడం వల్లే దేశంలో ఈ పరిస్థితి ఎదురైందని  రష్యా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే, రష్యాలో ఇప్పటివరకు 55లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడగా.. లక్షా 34వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని