Sandeshkhali Case: షాజహాన్‌ షేక్‌ను అరెస్ట్‌ చేయండి.. కలకత్తా హైకోర్టు ఆదేశాలు

Sandeshkhali Case: సందేశ్‌ఖాలీ కేసులో తృణమూల్‌ నేత షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. దీనిపై తాము ఎలాంటి స్టే విధించలేదని వెల్లడించింది.

Updated : 26 Feb 2024 17:17 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali)లో మహిళలపై గూండాలు లైంగిక వేధింపులు పాల్పడ్డారని, వారి భూములను ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్‌ కాంగ్రెస్‌  (TMC) నేత షాజహాన్‌ షేక్‌ (Sheikh Shajahan)ను అరెస్టు చేయకూడదని తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అతడిని అరెస్టు చేసి తీరాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. 

సందేశ్‌ఖాలీ వ్యవహారంపై టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఆదివారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కేసులో పోలీసుల చేతులను కోర్టు కట్టేసింది. అందుకే షాజహాన్‌ను అరెస్టు చేయలేకపోతున్నాం’’ అని అన్నారు. సోమవారం ఈ కేసు కలకత్తా హైకోర్టులో విచారణకు రాగా.. అభిషేక్‌ వ్యాఖ్యలను అమికస్‌ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టు నిలుపుదల చేశారా? లేదా అన్నదానిపై స్పష్టతనివ్వాలని కోరారు.

సందేశ్‌ఖాలీలో నిరసనలు... అజయ్‌ మైతీని పార్టీ నుంచి తొలగించిన టీఎంసీ

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మేం అరెస్టుపై ఎలాంటి స్టే విధించలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అతడు (షాజహాన్‌) నిందితుడిగా ఉన్నాడు. అలాంటప్పుడు అతడ్ని అరెస్టు చేయాల్సిందే’’ అని స్పష్టం చేసింది. సందేశ్‌ఖాలీ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాజహాన్‌ షేక్‌, ఈడీ, సీబీఐ, రాష్ట్ర హోం సెక్రటరీని పార్టీలుగా ఇంప్లీడ్‌ చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీనిపై వార్తాపత్రికల్లో పబ్లిక్‌ నోటీసు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అతడిపై న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు ఆ నోటీసుల్లో పేర్కొనాలంది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని