CBI: రష్యాకు రప్పించి.. యుద్ధంలో దించి.. మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు!

భారత్‌ నుంచి యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి.. వారిని ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలోకి దించుతోన్న ఓ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సీబీఐ ఛేదించింది.

Updated : 08 Mar 2024 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ నుంచి యువకులను మోసపూరితంగా రష్యా (Russia)కు తరలించి.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం (Ukraine War Zone)లోకి దించుతోన్న ఓ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ గుట్టు రట్టయ్యింది. రష్యా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇద్దరు ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దృష్టి సారించింది. వారిని రాజస్థాన్‌కు చెందిన మొయినుద్దీన్ చిప్పా, క్రిస్టినాలుగా గుర్తించింది. 17 వీసా కన్సల్టెన్సీలు, వాటి యజమానులు, ఏజెంట్ల పేర్లనూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సోదాలను ముమ్మరం చేసింది.

‘‘మెరుగైన జీవితం, విద్య, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నిందితులు తమ ఏజెంట్ల ద్వారా భారతీయులను రష్యాకు రప్పించారు. వారి నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. ఫీజుల్లో రాయితీ, వీసా పొడిగింపులు అందిస్తూ.. అనుమానాస్పద ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కల్పించి విద్యార్థులను మోసగించారు. ఇటువంటి 35 కేసులను గుర్తించాం’’ అని సీబీఐ తెలిపింది. రష్యాకు చేరుకున్న అనంతరం పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారని, యుద్ధంలో చేరేలా బలవంతం చేశారని పేర్కొంది. ఈ క్రమంలో యుద్ధక్షేత్రంలో కొంతమంది బాధితులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.

పర్యటక వీసాపై రష్యాకు వెళితే.. అరెస్టు చేసి సైన్యంలోకి పంపారు!

ఈ వ్యవహారంలో దిల్లీ, తిరువనంతపురం, ముంబయి, చండీగఢ్‌, మదురై, చెన్నై తదితర 13 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.50 లక్షలకుపైగా నగదు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, సీసీటీవీ ఫుటేజీ వంటి ఎలక్ట్రానిక్ రికార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలు కొనసాగుతున్నాయని ఓ అధికారి చెప్పారు. విచారణ నిమిత్తం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్ పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, వారంతా వ్యవస్థీకృత పద్ధతిలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.

రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: కేంద్రం 

ఈ వ్యవహారాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బాధితులను వెంటనే భారత్‌కు తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ‘సీబీఐ’ ఛేదించిందని పేర్కొంటూ.. మోసానికి పాల్పడిన ఏజెంట్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పింది. మాస్కో సైన్యంతో ముడిపడిన సహాయక ఉద్యోగాల కోసం ఏజెంట్లు ఇచ్చే తప్పుడు హామీలకు మోసపోవద్దని, ఇది ప్రాణాలకే ప్రమాదకరమని పౌరులను హెచ్చరించింది. యుద్ధక్షేత్రంలోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే విషయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని