Terror attack: జైహింద్ నాన్న.. కర్నల్ అంత్యక్రియల్లో పసిబిడ్డల కళ్లనిండా అమాయకత్వమే..!

Jammu Kashmir:కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు యోధుల అంత్యక్రియల్లో దృశ్యాలు మెలిపెడుతున్నాయి. కర్నల్‌ మన్‌ప్రీత్‌సింగ్ అంత్యక్రియల్లో ఆయన పిల్లల అమాయకత్వం ప్రతిఒక్కరినీ కంటతడిపెట్టిస్తోంది.  

Published : 15 Sep 2023 17:03 IST

దిల్లీ: కడసారి చూపులు.. ఆత్మీయుల రోదనలతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నభరితంగా మారింది. మరోవైపు అక్కడ ఏం జరుగుతుందో తెలీక రెండు పసి హృదయాలు కలవరపడుతున్నాయి. జైహింద్ నాన్న అంటూ వీడ్కోలు పలుకుతున్నాయి. వారి అమాయకత్వం చూపరుల మనసుల్ని మరింత బరువెక్కించింది. కశ్మీర్‌(Jammu Kashmir)లో ఉగ్రఘాతుకంలో అమరుడైన కర్నల్ మన్‌ప్రీత్ సింగ్ అంత్యక్రియల్లో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు ప్రతి మానవ హృదయాన్ని మెలిపెడుతున్నాయి. (Terror attack)

కర్నల్ మన్‌ప్రీత్‌ సింగ్‌(Colonel Manpreet Singh) భౌతికకాయాన్ని శుక్రవారం ఆయన స్వస్థలం ముల్లాన్‌పుర్‌కు తీసుకువచ్చారు. దానిని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరోపక్క సింగ్ ఆరేళ్ల కుమారుడు సైనికుడి దుస్తుల్లో తండ్రికి వీడ్కోలు సెల్యూట్ చేశాడు. పక్కనే ఉన్న చిన్నారి చెల్లి తన అన్నను అనుకరించింది. ఆ ఇద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంత వయస్సు వారికి లేదు కూడా.  కర్నల్‌ దూరమైన బాధ ఒకవైపు.. పసిపిల్లల అమాయకత్వం మరోవైపు అక్కడున్న ప్రతి మనసును బరువెక్కించింది.

ఆ ఫోన్‌ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!

19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు కర్నల్‌ సింగ్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అనంత్‌ నాగ్‌లోని కొకెన్‌నాగ్‌కు చెందిన గడోల్‌ అడవుల్లో ఉన్న ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. ఈ ఘటనలో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్‌ ధోనక్‌, డీఎస్పీ హుమాయూన్‌ భట్‌ సహా మరో సైనికుడు అమరులయ్యారు. ముగ్గురు కీలక అధికారుల మరణంతో సైన్యం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. భారీగా బలగాలను ఆ ప్రాంతానికి తరలించింది. దాంతో మూడు రోజులుగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మరోపక్క ఆశిశ్‌ భౌతిక కాయాన్ని పానిపట్‌లోని ఆయన సొంత గ్రామానికి తరలించారు. ఆయన అంతిమ యాత్ర భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. ఆశిశ్‌కు రెండేళ్ల కుమార్తె ఉంది. మరోపక్క భట్ అంత్యక్రియలు నిన్న ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని