దేశాన్ని హత్య చేశారని అంటే.. కాంగ్రెస్ నేతలు బల్లలు చరుస్తున్నారు..! మండిపడ్డ స్మృతి ఇరానీ

లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ప్రసంగంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. 

Published : 09 Aug 2023 14:36 IST

దిల్లీ: అవిశ్వాసం తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన  ప్రసంగంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. 

‘మీరు ఇండియా(ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి) కాదు. ఇండియాలో అవినీతి ఉండదు. ఇండియా మెరిట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తుంది. వారసత్వాన్ని కాదు’ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా క్విట్ ఇండియా(భారత్‌ను వీడండి) ప్రస్తావన తీసుకొచ్చారు. అవినీతి.. భారత్‌ను వీడాలి, వారసత్వం.. భారత్‌ను వీడాలి వంటి పదాలను ఉపయోగించారు. అలాగే మణిపుర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

‘మణిపుర్ దేశంలో భాగం.. దానిని ఎవరూ విడదీయలేరు. భారత మాతను హత్య చేశారని అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారు. దేశంలో అవినీతిని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీనే. యూపీఏ హయాంలో మహిళలపై ఎన్నో అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్‌లో బాలికపై గ్యాంగ్ రేప్‌ చేసి.. ముక్కలుగా నరికేశారు. కశ్మీర్‌ పండితులు, మహిళలపై జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా..? వాటిని ఒక సినిమాలో చూపిస్తే.. కాంగ్రెస్ నేతలు దాన్నొక ప్రచారమని అన్నారు. వారే ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు’ అని ఘాటుగా బదులిచ్చారు. పాదయాత్రలో భాగంగా ఆయన ఆ ఆర్టికల్‌ను మళ్లీ తెస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, ఆర్టికల్‌ 370 రద్దు వల్లే రాహుల్ పాదయాత్ర చేయగలిగారని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని