Aditya L1: జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్‌1: ఇస్రో ఛైర్మన్‌

Aditya L1: సౌర వాతావరణం అధ్యయనం కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం చివరి ఘట్టానికి చేరువైంది. వచ్చే నెల 6వ తేదీన తన గమ్యాన్ని అందుకోనుంది.

Updated : 23 Dec 2023 16:06 IST

దిల్లీ: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్‌1 (Aditya L1)’ తన ప్రయాణంలో తుది అంకానికి సమీపించింది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. ఓ ఎన్జీఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

‘ఆదిత్య ఎల్‌1 జనవరి 6వ తేదీన ఎల్‌1(లగ్రాంజ్‌ పాయింట్‌-1) పాయింట్‌లోకి ప్రవేశిస్తుందని మేం అంచనా వేస్తున్నాం. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ‘ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎల్‌1 పాయింట్‌కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్‌ను మండిస్తాం. తర్వాత ఈ వ్యోమనౌక ఎల్‌1 కేంద్రంలో స్థిరపడుతుంది. అది విజయవంతంగా ఆ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఐదేళ్లపాటు భారత్‌ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుంది. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుంది’ అని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. అలాగే భారత స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు ఇస్రో ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు.

‘ఒకే ఫ్రేమ్‌లో భూమి-చంద్రుడు.. ఆపై ఆదిత్య-ఎల్‌ 1 సెల్ఫీ..!’

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య ఎల్‌1’ లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1కు చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలుపెడుతుంది. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 2వ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని