President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా..?

భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. .....

Updated : 13 Jun 2022 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక ఆద్యంతం ఆసక్తికరమే. మన రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా!

  1. జులై 18న జరగబోయేది ‘16వ రాష్ట్రపతి ఎన్నిక’ అయినా.. ఎన్నిక కాబోయేది మాత్రం భారత 15వ రాష్ట్రపతి. ప్రస్తుతం రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత 14వ రాష్ట్రపతిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
  2. ఒకసారి రాష్ట్రపతి అయినవారు ఎన్నిసార్లయినా ఆ పదవికి పోటీ చేయవచ్చు. ఇప్పటివరకు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ మాత్రమే రెండోసారి ఎన్నికయ్యారు.
  3.  ప్రజాస్వామ్య అత్యున్నత విలువలను అనుసరించి రెండోసారి పోటీచేయకూడదన్న సంప్రదాయం ప్రకారం బాబూ రాజేంద్ర ప్రసాద్‌ తరువాత ఎవరూ రెండోసారి పోటీకి దిగడం లేదు.
  4. ఒకే ఒక్కసారి మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాక్టింగ్‌ రాష్ట్రపతిగా వ్యవహరించారు. 1969లో నాటి రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూయడంతో అప్పటి ఉప రాష్ట్రపతి వి.వి.గిరి యాక్టింగ్‌ రాష్ట్రపతిగా వ్యవహరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వి.వి.గిరి కూడా జులై 20, 1969న రాజీనామా చేయడంతో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా యాక్టింగ్‌ రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  5. ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ రాష్ట్రపతిగా ఉంటూ.. 1977 ఫిబ్రవరి 11న కన్నుమూశారు. ఆయన స్థానంలో అప్పటి ఉపరాష్ట్రపతి బి.డి.జెట్టి యాక్టింగ్‌ రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  6. ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికలు 15 సార్లు జరగ్గా ఒకే ఒకసారి (1977లో) నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  7. సాధారణంగా రాజకీయ పార్టీలు ఫలానా వ్యక్తికే ఓటు వేయాలని ‘విప్‌’ జారీ చేస్తాయి. రాష్ట్రపతి ఎన్నికలకు పార్టీల విప్‌ ఉండదు.
  8. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ లేదా లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ వ్యవహరిస్తారు. రాష్ట్ర శాసనసభ కార్యదర్శి సహాయ రిటర్నింగ్‌ అధికారిగా ఉంటారు. చీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ ఎలక్షన్‌గా ఎన్నికల ప్రధానాధికారి, రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ఉంటారు.
  9. నామినేషన్‌ సమయంలో చెల్లించాల్సిన డిపాజిట్‌ రూ.15,000
  10. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4809 మంది ఓటర్లుగా ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు సమానమైన ఓట్ల విలువనే కలిగి ఉన్నారు. ఓటు విలువ లెక్కింపునకు 1971 నాటి 54.93 కోట్ల జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. 2026 వరకూ ఇదే ప్రాతిపదిక కొనసాగనుంది. ఎంపీలు (776మంది) ఓటు విలువ 5,43,200 కాగా.. ఎమ్మెల్యేలు (4033) ఓటు విలువ 5,43,231గా ఉంది.
  11. 1967 ఎన్నికల్లో అత్యధికంగా 17 మంది పోటీ చేశారు. నాలుగో రాష్ట్రపతి ఎన్నికల్లో, ఐదో రాష్ట్రపతి ఎన్నికల్లో 15 మంది చొప్పున పోటీ చేశారు.
  12. రాష్ట్రపతి ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఉండదు.
  13. ఎమ్మెల్సీలకు, నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
  14. ఓటింగ్‌ ముగిసిన వెంటనే పోలింగ్‌ బాక్స్‌లను పార్లమెంట్‌లోని ఎన్నికల కార్యాలయానికి చేర్చాల్సి ఉంటుంది. అక్కడే దేశంలో పోలైన అన్ని ఓట్ల లెక్కింపూ జరుగుతుంది.
  15. మొదట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ ప్రతిపాదించి, మరో ఎమ్మెల్యే లేదా ఎంపీ బలపరిస్తే సరిపోయేది. 1974లో రాజ్యాంగ సవరణ చేసి ప్రతిపాదించేవారి సంఖ్య పది, బలపరిచేవారి సంఖ్యను పదికి పెంచారు. 1997లో మళ్లీ రాజ్యాంగ సవరణతో ప్రతిపాదించేవారి సంఖ్య 50కి, బలపరిచేవారి సంఖ్యను 50కి పెంచారు.
  16. బ్యాలెట్‌ బాక్స్‌కి విమానంలో టికెట్‌, సీటు: ఒక వస్తువుకి ప్రయాణికుడితో సమానంగా విమాన టికెట్‌ కొనడం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానే జరుగుతుంది. దిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు, ఓటింగ్‌ ముగిసిన తర్వాత మళ్లీ దిల్లీకి బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించడానికి విమానంలో టికెట్లు కొంటారు. బ్యాలెట్‌ బాక్స్‌ను తీసుకెళ్లే ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారితో పాటు.. బ్యాలెట్‌ బాక్స్‌కు టికెట్‌ కొనుగోలు చేస్తారు. ‘బ్యాలెట్‌ బాక్స్‌, ప్రెసిడెన్షియల్‌ ఎలక్షన్‌’ పేరుతో టికెట్‌ కొని, దాన్ని ప్రయాణికుడి మాదిరిగానే సీటులోనే ఉంచి తీసుకెళ్తారు. విమాన ప్రయాణికుల జాబితాలోనూ ఈ పేరు ఉంటుంది. ప్రథమ పౌరుడి ఎన్నికలో ఈ ప్రత్యేకత దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోంది.
  17.  ఎమ్మెల్యేల అత్యధిక ఓటు విలువ ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌ (208), తర్వాత స్థానంలో తమిళనాడు, ఝార్ఖండ్‌ (176) ఉన్నాయి.
  18.  అతి తక్కువ ఓటు విలువ ఉన్న రాష్ట్రం సిక్కిం (7).
  19.  ఎన్నికలో పోలింగ్‌ సందర్భంగా ఈసీ ఇచ్చే కలాలను మాత్రమే బ్యాలెట్‌పై వాడాల్సివుంది.
  20. రాష్ట్రపతి ఎన్నికలో నోటాకు అవకాశం లేదు. ఏదో ఒక అభ్యర్థికి ఓటు వేయాల్సిందే.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని