NCERT: ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్‌ కమిటీలో సుధామూర్తి

పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకు ఎన్‌సీఈఆర్‌టీ ఓ కమిటీని నియమించింది.

Updated : 12 Aug 2023 17:45 IST

దిల్లీ: జాతీయ స్థాయిలో మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకు ‘ది నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ది నేషనల్‌ సిలబస్‌ అండ్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ కమిటీ (NSTC) పేరుతో 19 మంది సభ్యులను నియమించింది. దీనికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఐఈపీఏ) ఛాన్సలర్‌ మహేశ్‌ చంద్ర పంత్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధా మూర్తి, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత కర్త చాము కృష్ణశాస్త్రి, సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌...తదితరులకు ఎన్‌సీఈఆర్‌టీ స్థానం కల్పించింది.

పాఠశాల సిలబస్‌ని రూపొందించడంతోపాటు, 3 నుంచి 12వ తరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అభివృద్ధి చేసే అధికారం ఎన్‌ఎస్‌టీసీకి ఉంటుంది. అంతేకుండా 1, 2 తరగతుల ప్రస్తుత పాఠ్యపుస్తకాలను సవరించేందుకు కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వొచ్చు. ఎన్‌ఎస్‌టీసీ అభివృద్ధి చేసిన పాఠ్యపుస్తకాలు, పాఠ్యప్రణాళికలను ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించి పంపిణీ చేస్తుంది. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా పాఠశాలల్లో పాఠ్యాంశాల సవరణకు సంబంధించిన వివరాలను ది నేషనల్‌ కర్కిలమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (NCF-SE).. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు జులై 28న పంపించింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీఈఆర్‌టీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్‌ఎస్‌టీసీలో కమిటీలో సభ్యుడైన చాము కృష్ణ శాస్త్రి.. భారతీయ భాషా సమితి అధిపతిగా కూడా సేవలందిస్తున్నారు. భారతీయ భాషలను ప్రమోట్‌ చేయడంలో ఈ సమితి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్‌ఎస్‌టీసీ కార్యనిర్వహణలో సాయం చేసేందుకు వీలుగా నేషనల్‌ ఓవర్‌సైట్‌ కమిటీ (NOC) పేరుతో  ఎన్‌సీఈఆర్‌టీ మరో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనికి సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌ ఛాన్సలర్‌ జగ్‌బిర్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని