Covid Vaccine: దేశంలో 78 శాతం అర్హులకు తొలిడోసు పూర్తి!

దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైన వారిలో 78శాతం మందికి తొలి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు.

Published : 01 Nov 2021 23:40 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడి

దిల్లీ: దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైన వారిలో 78 శాతం మందికి తొలి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 35 శాతం మందికి ఇప్పటికే రెండు డోసులు పూర్తి అయినట్లు తెలిపారు. దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీలో ఇదో అసాధారణ విషయంగా అభివర్ణించిన ఆయన.. వైరస్‌ పోరులో భారత్‌ వేగంగా ముందుకు దూసుకెళ్తోందన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 106 కోట్ల 31లక్షల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, గడిచిన 24 గంటల్లో కేవలం 12లక్షల డోసులను మాత్రమే అందించినట్లు పేర్కొంది. దేశంలో గతకొన్ని రోజులుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబరులో 24 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయగా.. అక్టోబర్‌లో మాత్రం 17 కోట్ల డోసులను మాత్రమే పంపిణీ చేయగలిగారు. రాష్ట్రాల వద్ద 10 కోట్లకుపైగా డోసులు నిల్వ ఉన్నప్పటికీ పంపిణీలో మాత్రం రాష్ట్రాలు సరిగా వ్యవహరించడం లేదని కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రజలు కూడా రెండో డోసు తీసుకునేందుకు ఆసక్తి కనబరచకపోవడం కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించడానికి మరో కారణంగా తెలుస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న 40 జిల్లాల అధికారులతో ప్రధాని మోదీ బుధవారం సమావేశం కానున్నారు.

 మరోవైపు దేశంలో రోజువారీగా వెలుగు చూస్తున్న కరోనా వైరస్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కరోజే 8 లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 12వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 251 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 4లక్షల 58వేలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మృతుల సంఖ్య 50లక్షలు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని