Covid Symptoms: స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయా?

వయసుతో పాటు స్త్రీ, పురుషుల్లోనూ వేర్వేరుగా ప్రభావం చూపిస్తున్నట్లు బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

Published : 31 Jul 2021 15:26 IST

బ్రిటన్‌ పరిశోధకుల తాజా అధ్యయనం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను నిర్ధారించడంలో లక్షణాలను పసిగట్టడమే అత్యంత కీలకం. ఇవి ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవి వయసుతో పాటు స్త్రీ, పురుషుల్లోనూ వేర్వేరుగా ప్రభావం చూపిస్తున్నట్లు బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. తాజా పరిశోధన పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ డిజిటల్‌ హెల్త్‌లో ప్రచురితమైంది.

వివిధ వయసుల వారితో పాటు స్త్రీ, పురుషుల్లో కరోనా వైరస్‌ ఏవిధమైన లక్షణాలు చూపిస్తుందని తెలుసుకునేందుకు కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం రూపొందించిన ZOE కొవిడ్‌ యాప్‌ సమాచారాన్ని విశ్లేషించారు. వీటిలో తీవ్ర దగ్గు, వాసన కోల్పోవడం, కడుపునొప్పితో పాటు పాదాలకు చిన్నపాటి వాపు రావడం లక్షణాలే ప్రధానంగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 60ఏళ్ల వయసుపైబడిన వారిలో వాసన కోల్పోయే ప్రభావం తక్కువగా కనిపించింది. ఇక 80ఏళ్ల వయసువారిలో ఈ లక్షణం దాఖలాలే లేవు. కానీ, ఇలాంటి వృద్ధుల్లో ఎక్కువగా డయేరియా ప్రధాన లక్షణంగా కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. 60నుంచి 70ఏళ్ల మధ్య వారిలో ఛాతి, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం లక్షణాలు కనిపించాయి. వృద్ధులతో పోలిస్తే 40 నుంచి 50ఏళ్ల వారిలో దగ్గు, శరీరం చల్లగా మారడం వంటి లక్షణాలు ఎక్కువా కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు.

స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా..

ఇక లింగ వైవిధ్యం విషయానికొస్తే.. శ్వాస సరిగా ఆడకపోవడం, అలసట, చలి జ్వరం వంటి లక్షణాలు పురుషుల్లో ప్రధానంగా కనిపించినట్లు బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. స్త్రీలలో వాసన కోల్పోడం, ఛాతి నొప్పి, తీవ్ర దగ్గు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. కొవిడ్‌ ప్రారంభంలో కనిపించే లక్షణాలు వ్యక్తి వ్యక్తితో పాటు ఇతర కుటుంబాల్లోనూ వేర్వేరుగా ఉంటాయని కింగ్స్‌ కాలేజీకి చెందిన నిపుణులు క్లెయిర్‌ స్టీవ్స్‌ పేర్కొన్నారు. ఇలా సొంత అంచనాలతో కొవిడ్‌ లక్షణాలను ముందుగానే పసిగట్టడం ద్వారా కొవిడ్‌ నిర్ధారణను ఆలస్యం కాకుండా జాగ్రత్తపడవచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యలు సమర్థంగా చేయవచ్చని తెలిపారు. అత్యధిక వ్యాప్తి కలిగిన కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాల్సిన ఆవశ్యకతను బ్రిటన్‌ పరిశోధకులు నొప్పి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని