Padmanabhaswamy Temple: 25ఏళ్ల ఆదాయ, ఖర్చులపై ఆడిట్‌ చేయాల్సిందే!

కేరళలోని ప్రముఖ పద్మనాభస్వామి ఆలయం ట్రస్టుకు భారత అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆలయానికి చెందిన ఆదాయ, ఖర్చుల ఆడిట్‌ విషయంలో ట్రస్టుకు మినహామింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టుకు తోసిపుచ్చింది.

Published : 23 Sep 2021 00:12 IST

పద్మనాభస్వామి ఆలయ ట్రస్టుకు స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

దిల్లీ: కేరళలోని ప్రముఖ పద్మనాభస్వామి ఆలయ ట్రస్టుకు భారత అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆలయానికి చెందిన ఆదాయ, ఖర్చుల ఆడిట్‌ విషయంలో ట్రస్టుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆలయంతో పాటు ట్రస్టుకు సంబంధించి గడిచిన 25ఏళ్లలో జరిగిన ఖర్చులు, ఆదాయాలపై ఆడిట్‌ (Audit)ను కచ్చితంగా చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా వీటిని మూడు నెలల్లోనే పూర్తిచేయాలని ఆదేశించింది.

పద్మనాభస్వామి ఆలయంలో గత 25ఏళ్లలో ఆదాయ, ఖర్చులకు సంబంధించి ఆడిట్‌ చేయాలని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నుంచి ట్రస్టుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తాజాగా ఆలయ ట్రస్టు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. అంతేకాకుండా ఇదివరకు ఇచ్చిన ఆదేశాల్లో కేవలం పూజలు, ఆలయ నిర్వహణ విషయాలు మాత్రమే పేర్కొన్నారని.. ట్రస్టు గురించి కాదని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఆడిట్‌ కేవలం ఆలయానికి మాత్రమే పరిమితం కాదని ట్రస్టుకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ఆడిట్‌ను వీలైనంత తొందరగా.. సాధ్యమైతే మూడు నెలల్లోపే చేపట్టాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, భక్తులనుంచి వచ్చే ఆదాయం, ఆలయ నిర్వహణ ఖర్చులకు సరిపోవడం లేదని దీంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ కమిటీ ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘కేరళలో అన్ని దేవాలయాలు మూతబడ్డాయి. ఈ ఆలయం నిర్వహణకు నెలకు రూ.1.25కోట్ల ఖర్చు అవుతుంటే ఆదాయం మాత్రం రూ.60నుంచి 70లక్షలు మాత్రమే వస్తోంది. అందుకే ట్రస్టు నుంచి ఆర్థిక సహాయం అవసరం. దీనిపై కొన్ని సూచనలు కోరుతున్నాం’ అని ఆలయ నిర్వహణ కమిటీ తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో ఆడిట్‌ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబం ఏర్పాటు చేసిన ట్రస్టు కోర్టును ఆశ్రయించింది. అందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం ఆలయం, ట్రస్టుకు సంబంధించి గత 25ఏళ్ల ఆదాయ, ఖర్చులపై ఆడిట్‌ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని