₹7.3వేల కోట్ల డ్రగ్స్‌ అనుకున్నారు.. బోల్తా పడ్డారు!

‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి’ అని ఓ తెలుగు సినిమాలో పాట ఉంది. ఓ కేసు విషయంలో థాయ్‌లాండ్‌ అధికారులకు ఈ పాట సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. ఇటీవల భారీగా డ్రగ్స్‌ నిల్వలను పట్టుకున్నామని, దేశంలో అత్యంత భారీ డ్రగ్స్‌ పట్టివేత

Published : 27 Nov 2020 01:11 IST


(Photo: thai oncb twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి’ అని ఓ తెలుగు సినిమాలో పాట ఉంది. ఓ కేసు విషయంలో థాయ్‌లాండ్‌ అధికారులకు ఈ పాట సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. ఇటీవల భారీగా డ్రగ్స్‌ నిల్వలను పట్టుకున్నామని, దేశంలో అత్యంత భారీ డ్రగ్స్‌ పట్టివేత ఇదేనని గొప్పగా ప్రకటించిన నార్కోటిక్‌ అధికారులు, పోలీసులు.. వాళ్లు స్వాధీనం చేసుకున్నది అసలు డ్రగ్సే కాదని తెలిసి ఖంగుతిన్నారు. 

‘కెటమిన్‌’ అనే డ్రగ్‌ను సాధారణంగా వైద్యరంగంలో ఔషధంగా ఉపయోగిస్తారు. అనెస్తీషియా, నొప్పి నివారణకు వాడుతుంటారు. అయితే ఈ ఔషధానికి మత్తు ఇచ్చే గుణం ఉండటంతో థాయ్‌లాండ్‌లోని నైట్‌ క్లబ్స్‌లో యువత, టూరిస్టులు దీన్ని డ్రగ్‌లా వాడుతున్నారు. కాగా, నవంబర్‌ 12న నార్కోటిక్‌ అధికారులకు చాచోఎంగ్‌సావో ప్రావిన్స్‌లోని టాంబొన్‌ తా ఖమ్‌ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో పెద్ద మొత్తంలో కెటమిన్‌ డ్రగ్‌ నిల్వలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే గోదాంపై దాడి చేసి దాదాపు 11.5 టన్నుల బరువున్న 475 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ నమూనా సేకరించి పరీక్షించగా అది కెటమిన్‌ అని నిర్థారణ కావడంతో అధికారులు.. మీడియాకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. దేశంలోనే అత్యంత భారీ డ్రగ్స్‌ నిల్వను పట్టుకున్నామని, వీటి విలువ దాదాపు 1 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు (₹7.3వేల కోట్లు) ఉంటుందని వెల్లడించారు. 

ఆ తర్వాత.. స్వాధీనం చేసుకున్న బస్తాలను అధికారులు పతుమ్‌ థాని ప్రావిన్స్‌కు తీసుకెళ్లి 66 బస్తాల నుంచి నమూనాలు సేకరించి మళ్లీ పరీక్షించారు. ఈ సారి పరీక్ష ఫలితాల్లో అది కెటమిన్‌ కాదని తెలింది. కెటమిన్‌లాగే ఉండే ట్రైసోడియం ఫాస్ఫెట్‌ అని పరీక్షించిన వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ట్రైసోడియం ఫాస్ఫెట్‌ను ఆహారం తయారీలో ఉపయోగిస్తుంటారు. అలాగే మరకలు తొలగించే డిటర్జెంట్‌ పౌడర్‌లా కూడా ఉపయోగపడుతుంది. ఈ కేసులో తాము చేసిన పొరపాటును గ్రహించిన అధికారులు నాలుక్కరుచుకున్నారు. ఈ ఘటనపై తాజాగా న్యాయశాఖ మంత్రి సొమ్సాక్‌ థెప్సుతిన్‌ స్పందిస్తూ.. సాంకేతిక లోపం, నార్కోటిక్‌ అధికారుల అవగాహన లేమి కారణంగా ట్రైసోడియం ఫాస్ఫెట్‌ను కెటమిన్‌గా పొరపడ్డారని తెలిపారు. తాము తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై వచ్చే విమర్శలను మేం భరిస్తామని చెప్పారు. పూర్తిస్థాయిలో మరిన్ని పరీక్షలు నిర్వహించి, దర్యాప్తు చేస్తామని మంత్రి సొమ్సాక్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని