MEA: రష్యా సైన్యంలో ఇంకా 20-30 మంది భారతీయులు.. విదేశాంగ శాఖ వెల్లడి

MEA: రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయిన భారతీయులందరినీ వీలైనంత త్వరగా విడిపిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

Published : 29 Feb 2024 19:04 IST

దిల్లీ: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం (Ukraine-Russia War)లో కొంతమంది భారతీయులు (Indians).. మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. వీరి విడుదల కోసం కేంద్ర విదేశాంగశాఖ చర్యలు చేపడుతూనే ఉంది. అయితే, ఇంకా 20-30 మంది భారతీయులు ఆ దేశ సైన్యం వద్ద చిక్కుకుపోయారని విదేశాంగ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ గురువారం వెల్లడించారు.

‘‘రష్యా సైన్యం వద్ద సహాయకులుగా ఉండేందుకు కొందరు భారతీయులు అంగీకరించినట్లు మాకు సమాచారం రాగానే వారి విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. దీనిపై దిల్లీ, మాస్కోలోని రష్యన్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇంకా 20-30 మంది అక్కడ చిక్కుకుపోయినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఆయన తెలిపారు. భారత పౌరులెవరూ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ జోన్‌లోకి వెళ్లొద్దని, క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకోవద్దని మరోసారి సూచించారు.

రష్యాకు అండగా ఉత్తర కొరియా అధినేత

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఓ భారతీయుడు మరణించినట్లు ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. రష్యా ఆక్రమిత దొనెట్స్ ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. మృతుడిని సూరత్‌కు చెందిన హేమిల్‌ అశ్విన్‌భాయ్‌ మంగుకియాగా గుర్తించారు. అతడు డిసెంబరు 2023లో రష్యాకు వెళ్లగా, ఆ తర్వాత సైన్యంలో పని చేసేందుకు కాంట్రాక్టుపై సంతకం చేసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని