Bengaluru: విద్యార్థులకు మళ్లీ ఉచిత సైకిళ్లు.. సీఎంతో చర్చిస్తా: మంత్రి

పాఠశాలల్లో డ్రాపౌట్‌ రేటును తగ్గించడమే లక్ష్యంగా ఉచిత సైకిళ్లు పంపిణీపై డిమాండ్లు వస్తున్న వేళ కర్ణాటక విద్యాశాఖ మంత్రి స్పందించారు.

Published : 07 Dec 2023 18:54 IST

బెళగావి:  రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్‌ అవుట్ల రేటును అరికట్టేందుకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీని పునఃప్రారంభించే అంశంపై విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప స్పందించారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్యతో చర్చిస్తానని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని పలు ప్రాంతాల్లోని తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో చిక్కబల్లాపుర ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అడిగిన ప్రశ్నలపై మంత్రి పైవిధంగా స్పందించారు. 2019-20లో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ జరిగిందని.. ఆ తర్వాత నిలిచిపోయిందన్నారు. కాకపోతే, విద్యార్థులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత బస్సు పాసులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసే విషయంలో వచ్చే బడ్జెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రుల నుంచి ఈ డిమాండ్‌ వస్తోందన్న మంత్రి మధు బంగారప్ప.. ఆర్థిక శాఖ సీఎం సిద్దరామయ్య పరిధిలో ఉన్నందున ఆయనతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు,  పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, గ్రామీణ విద్యార్థుల ఇబ్బందులపై  ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక సభలో మాట్లాడారు. బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలోని తమ భాజపా ప్రభుత్వం ఉచిత సైకిళ్ల పంపిణీ ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆ పథకాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేయగా.. మంత్రి దీటుగా బదులు ఇచ్చారు. ఆ పథకాన్ని నిలిపివేసింది కూడా భాజపా సర్కారేనని.. అలా చేసి ఉండాల్సింది కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని