25 years of Dil Se: అప్పట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా ‘ఛయ్యా.. ఛయ్యా’ ఉండాల్సిందే! ‘దిల్‌ సే’కు 25ఏళ్లు!

25 years of Dil..‘దిల్‌ సే’ విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 21 Aug 2023 17:48 IST

25 years of Dil: 90వ దశకంలో చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరినీ ఓ ఊపు ఊపేసిన పాట ‘చెలి ఛయ్యా.. ఛయ్యా..’. స్కూల్‌, కాలేజ్‌ వార్షికోత్సవం, పెళ్లి వేడుక, విహారయాత్ర కార్యక్రమం ఏదైనా ఈ పాట వినపడాల్సిందే. చిందులేయాల్సింది. మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్‌, మనీషా కొయిరాల జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘దిల్‌ సే’. ఆగస్టు 21, 1998న విడుదలైన ఈ సినిమా సోమవారంతో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ‘దిల్‌ సే’బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.28 కోట్ల వసూళ్లను రాబట్టింది. అటు షారుఖ్‌, ఇటు మనీషా కొయిరాలా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది. ఏఆర్‌ రెహమాన్‌ తన మ్యూజిక్‌తో మంత్రముగ్ధులను చేశారు. భాషలతో సంబంధం లేకుండా తన పాటలతో అందరినీ కట్టిపడేశారు. ‘దిల్‌ సే’ 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు..

  • ‘రోజా’, ‘బొంబాయి’సినిమాల తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ఆసక్తికర చిత్రం ‘దిల్‌ సే’. సుఫీ సాంగ్‌ ‘థయ్యా.. థయ్యా’ స్ఫూర్తితో ఈ మూవీని రాసుకున్నారు.
  • అరబిక్‌ సాహిత్యంలో పేర్కొన్నట్లు ప్రేమ ఏడు రూపాలు ‘దిల్‌ సే’లో కనిపిస్తాయి. ఆకర్షణ, మోహం, ప్రేమ, పూజ్య భావం, ఆరాధన, స్థిరమైన భావన, మరణం. షారుఖ్‌ఖాన్‌ పోషించిన అమర్‌కాంత్‌ పాత్రలో ఈ ఏడు దశలు మనకు కనిపిస్తాయి.
  • ‘ఛయ్యా.. ఛయ్యా’ సాంగ్‌ను రన్నింగ్‌ ట్రైన్‌పై తీశారు. అప్పట్లో ఇదే సెన్సేషన్‌. ఈ పాట చిత్రీకరణ సమయంలో షారుఖ్‌ ఎలాంటి భద్రతా పరమైన చర్యలు తీసుకోలేదు. డూప్‌లేకుండా స్వయంగా చేశారు.
  • ‘జియా జిలే జాన్‌ ఛలే’ పాటను ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ఆలపించారు. ఈ పాట కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట పాడుతున్న సమయంలో హైపిచ్‌లో పాడాల్సి వచ్చినప్పుడు వయసు రీత్యా లత ఇబ్బంది పడటంతో ఏఆర్‌ రెహమాన్‌ జాగ్రత్తలు తీసుకున్నారు.
  • మనీషా కొయిరాలా పాత్ర కోసం మణిరత్నం తొలుత కాజోల్‌ను సంప్రదించారు. కానీ, ఆమె అందుకు అంగీకరించలేదు.
  • సినిమాలో కనిపించే కొన్ని పరేడ్‌సీన్స్‌ను భారత 50వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా చిత్రీకరించి, సినిమాలో ప్రదర్శించారు.
  • తొలుత ఈ సినిమాకు ‘లద్ధాఖ్‌ - ఏక్‌ ప్రేమ్‌ కహానీ’ అనే టైటిల్‌ అనుకున్నారు.
  • ‘ఛయ్యా.. ఛయ్యా’ పాటను శిల్పా సిరోద్కర్‌  చేయాల్సింది. అయితే, చివరి నిమిషంలో మణిరత్నం మలైకా అరోడాను తీసుకున్నారు.
  • హిందీలో ‘దిల్‌ సే’గా వచ్చిన ఈ సినిమాను తెలుగులో ‘ప్రేమతో..’, తమిళం, మలయాళంలో ‘ఉయిరే’ పేరుతో విడుదల చేశారు. అప్పట్లో తెలుగు పాటలు కూడా క్యాసెట్లు, రేడియో, మ్యూజిక్‌ ఛానళ్లలో మార్మోగిపోయాయి.
  • ‘దిల్‌ సే’లో పాపులర్‌ అయిన ‘ఛయ్యా ఛయ్యా’ పాట పేరు మీద  ఫర్దీన్‌ఖాన్‌, ప్రీతిజింటా జంటగా, పార్థో ఘోష్‌ ఓ  సినిమా మొదలు పెట్టారు. ఆ తర్వాత అది ఆగిపోయింది.
  • 49వ బెర్లిన్‌ అవార్డుల్లో నెట్‌ప్యాక్‌ అవార్డును మణిరత్నం అందుకున్నారు. జాతీయ ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్‌ శివన్‌, ఉత్తమ ఆడియో గ్రాఫర్‌గా హెచ్‌.శ్రీధర్‌కు జాతీయ అవార్డు వచ్చాయి.
  • 44వ ఫిలిం ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ పరిచయ నాయికగా ప్రీతి జింటా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌, ఉత్తమ సాహిత్య రచయితగా గుల్జార్‌ (ఛయ్యా ఛయ్యా) ఉత్తమ నేపథ్య గాయకుడిగా సుఖ్వీందర్‌సింగ్‌, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్‌శివన్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఫరాఖాన్‌లను అవార్డులు వరించాయి.
  • ముంబయిలో విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలా ఒక రోజు బయటకు వెళ్లిన షారుఖ్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆ సమయంలో కూడా ఎలాంటి విసుగు లేకుండా హాయిగా ‘ఛయ్యా.. ఛయ్యా’ పాట వింటూ ఎంజాయ్‌ చేసిన వీడియోను అప్పట్లో పంచుకున్నారు.
  • ‘దిల్‌సే’ విడుదలైన ఈ 25ఏళ్లలో దర్శకుడు మణిరత్నం ఈ మూవీని పూర్తిగా ఎప్పుడూ చూడలేదట. టీవీలో ప్రసారమైనా, లేదా సినిమా చూడాలనిపించి మొదలు పెట్టినా అక్కడక్కడా మాత్రమే చూసేవారట. ఎక్కువ సేపు మ్యూట్‌లోనే ఉండేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని