Pawan Kalyan: టాలీవుడ్‌ తలెత్తుకొనేలా.. ఫిల్మ్‌ ఛాంబర్‌ పని చేస్తుందనుకుంటున్నా: పవన్‌ కల్యాణ్‌

ఫిల్మ్‌ ఛాంబర్‌ నూతన కార్యవర్గానికి జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

Published : 02 Aug 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చలన చిత్ర పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber Of Commerce) నూతన కార్యవర్గం పని చేస్తుందని జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆకాంక్షించారు. తెలుగు సినిమా స్థాయి వాణిజ్య పరంగా రోజురోజుకూ విస్తృతమవుతున్న వేళ.. నూతన కార్యవర్గం ఆ స్థాయిని మరింత పెంచాలని కోరారు. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికైన నూతన కార్యవర్గానికి పవన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అధ్యక్షుడు దిల్ రాజు (Dil Raju), ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి సహా సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్లు మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని, కోట్ల సంపద సృష్టి జరుగుతుందన్నారు. పన్నులు చెల్లిస్తారన్నారు. అలాంటి చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి (TFCC)ని విజయవంతంగా నడిపించాలని నూతన కార్యవర్గానికి పవన్ సూచించారు.

సినిమాలు, రాజకీయాన్ని కలపొద్దు: సాయిధరమ్‌ తేజ్‌

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు జులై 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి నిర్మాత సి.కల్యాణ్‌పై దిల్‌ రాజు విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్‌, కోశాధికారిగా ప్రసన్న కుమార్‌ గెలిచారు. రెండేళ్లకోసారి ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ సినిమాల విషయానికొస్తే.. సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఆయన నటించిన ‘బ్రో’ సినిమా ఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ పొందుతోంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్‌.. కాలం అనే దేవుడి పాత్రలో కనిపించి, అలరించారు. సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాలు చేస్తున్నారు. క్రిష్‌ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని