Radhe Shyam: ఆ ఒక్క సీన్‌ రెండేళ్ల కష్టం.. టికెట్‌ ధరల జీవో వస్తే హ్యాపీ: ప్రభాస్‌

తాను నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’లోని ఒక్క సీన్‌ కోసం దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ రెండేళ్లు శ్రమించారని ప్రభాస్‌ తెలిపారు. ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక.

Updated : 07 Mar 2022 17:39 IST

హైదరాబాద్‌: తాను నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’లోని ఒక్క సీన్‌ కోసం దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ రెండేళ్లు శ్రమించారని ప్రభాస్‌ తెలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. 70ల కాలంనాటి ఈ ప్రేమకథలో ప్రభాస్‌ హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్‌, ప్రభాస్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. సినిమా విశేషాలు పంచుకున్న అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధాలిచ్చారు. ఈ విశేషాలివీ..

‘‘గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలో సినిమా చేయాలంటే నాకు టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే పెద్దనాన్న (కృష్ణంరాజు) కెరీర్‌ని మార్చిన నిర్మాణ సంస్థ అది. అదే బ్యానర్‌లో ఆయనతో కలిసి ‘బిల్లా’లో నటించా. హిట్‌ అయింది. ‘రాధేశ్యామ్‌’ విషయంలోనూ కాస్త భయపడ్డా. కొవిడ్‌ వచ్చినా, మరో సమస్య ఎదురైనా పెద్దనాన్న మాకు సపోర్ట్‌గా నిలిచారు. ఇందులో ఆయన పరమహంస అనే కీలక పాత్ర పోషించారు. ఆయనతో కలిసి నేను రెండు సన్నివేశాల్లో కనిపిస్తా. రవిందర్ గారు ప్రతి చిన్న ఆకృతిని ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమాకు కావాల్సిన మెలొడీస్‌ జస్టిన్‌ ప్రభాకరన్‌ మాత్రమే ఇవ్వగలడని ఫిక్సయ్యాం. తన సంగీతంతో మంచి ఫీల్‌ అందించారు. ఈ సినిమాలోని షిప్‌ ఎపిసోడ్‌ కోసమే దర్శకుడు సుమారు రెండేళ్లు కష్టపడ్డారు. హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు ఈ సీన్‌ కోసం పనిచేశారు. ఈ సన్నివేశం నిడివి 13నిమిషాలు ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్‌ ఉంది కానీ ఫైట్లు లేవు. లవ్‌ ఉంది, థ్రిల్లింగ్‌ అంశాలున్నాయి. వ్యక్తిగతంగా నేను ఆస్ట్రాలజీని నమ్మను. అందుకే దర్శకుడు కథ చెప్తున్నప్పుడు సగం విన్నాక నో చెప్పేద్దామనుకున్నా. అయితే వినడం మొదలు పెట్టిన తర్వాత ఆసక్తి పెరిగింది. తప్పకుండా నటించాలనిపించింది’’. - ప్రభాస్‌.

‘‘కథకు తగ్గ సంగీతం అందించిన జస్టిన్‌ ప్రభాకరన్‌కు, ప్రేక్షకుల్ని హత్తుకునేలా నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్‌కు థ్యాంక్స్‌. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవిందర్‌ నాకు సోదరుడిలాంటివారు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్‌ వల్లే ఈ సాధ్యమైంది. పూజాహెగ్డే.. ప్రేరణ అనే పాత్రలో ఒదిగిపోయింది. విక్రమాదిత్యగా ప్రభాస్‌ అందరికీ గుర్తుండిపోతారు’’. - దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌.

‘‘సినిమా ఔట్‌పుట్‌ అత్యద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలు, ప్రభాస్‌కు ధన్యవాదాలు’’. - సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకరన్‌.

‘‘ముందుగా ఈ సినిమాను వింటేజ్‌ సెట్లలో ఇండియాలోనే  తెరకెక్కించాలనుకున్నారు రాధాకృష్ణ. ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలతో శారీరకంగా ఎంతో కష్టపడిన ప్రభాస్‌ తదుపరి సినిమా చిత్రీకరణ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకున్నారు. దాంతో ఈ కథను ఇటలీ నేపథ్యంలోకి మార్చారు దర్శకుడు. వింటేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ (70ల నాటి ఇటలీ కథ) ఆలోచన మాత్రం ప్రభాస్‌దే’’. - ప్రొడక్షన్‌ డిజైజన్‌ రవిందర్‌.

* చాలాకాలం తర్వాత ప్రేమకథలో నటించడం ఎలా అనిపించింది?

ప్రభాస్‌: వ్యక్తిగతంగా నాకు కిక్కిచ్చింది. ‘బాహుబలి’, ‘మిర్చి’, ‘సాహో’లాంటి యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాల తర్వాత చేయడంతో కాస్త రిలాక్స్‌గా అనిపించింది.

* ఈ చిత్రానికి ఎంత బడ్జెట్‌ పెట్టారు?

రవిందర్‌: ఇప్పటికే ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు అన్ని కోట్లు ఇన్ని కోట్టు రాసేశారు (నవ్వుతూ..). ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా.

రాధాకృష్ణ: సినిమాకు సుమారు రూ.300 కోట్లు ఖర్చయింది.  ప్రేక్షకులు తెరపై చూసేటపుడు  రూ.1000 కోట్ల అనుభూతి పొందుతారు.

* ఆంధ్రప్రదేశ్‌ సినిమా డిస్ట్రిబ్యూటర్లంతా మీ వైపే చేస్తున్నారు. మీ సినిమాతోనే అయినా టికెట్‌ ధరలు పెరుగుతాయని..

ప్రభాస్‌:రాధేశ్యామ్’ విడుదలకంటే ముందే టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే సంతోషిస్తా. ముఖ్యమంత్రితో సమావేశంపై నిర్ణయాలు నా నిర్మాతలకే తెలుసు. అయితే ప్రభుత్వం తక్షణమే స్పందిస్తే బాగుంటుంది. ఏపీలో పంపిణీదారులు, ప్రదర్శనకారులంతా ఈ సినిమావైపే చూస్తున్నారు.

* సినిమా ప్రచార విషయంలో ఎలా ఫీలయ్యారు?

ప్రభాస్‌: సాధారణంగా సినిమా ప్రచారం కష్టమైంది. అలాంటిది ఈ చిత్రం కోసం పలుమార్లు చేయాల్సి వచ్చింది. ‘హమ్మయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా పూర్తయింది మరికొన్ని రోజుల్లో సినిమా విడుదలవుతుంది’ అని అనుకునేలోపు కొవిడ్‌ విజృంభించింది.

* ఈ సినిమా అంగీకరించడానికి కారణం?

ప్రభాస్‌: దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. హస్తసాముద్రికా నిపుణుడిగా నటించడం థ్రిల్‌ అనిపించి ఈ కథను ఒకే చేశా.

* ఈ సినిమాలో యాక్షన్ అంశాలు ఆశించొచ్చా?

ప్రభాస్‌: ఇంతకుముందు చెప్పినట్టు 13నిమిషాల షిప్‌ ఎపిసోడ్‌లో యాక్షన్‌ మెండుగా ఉంటుంది. ప్రధమార్ధంలో కొన్ని ఛేజింగ్‌ సీన్లు ఉన్నాయి. అంతెందుకు నా పాత్ర ‘విక్రమాదిత్య’ మాట్లాడే తీరులోనూ మాస్‌ ఉంది.

* ఈ సినిమాకు అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ (హిందీలో) ఇచ్చారు? ఆయనతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది?

ప్రభాస్‌: ఆయనతో కలిసి నటించాలనేది కల. ఇన్నాళ్లకు నెరవేరింది. 20 ఏళ్ల కుర్రాడిలా ఎంతో హుషారుగా ఉంటారు.

* మీరు ఓ పూర్తిస్థాయి కామెడీ చిత్రంలో నటిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. నిజమేనా?

ప్రభాస్‌: అవును చేస్తున్నా. వివరాలు ఇప్పుడే చెప్పలేను.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని