Aditi Rao Hydari: అందుకు బాధగా ఉంది.. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకోగలను: అదితి

ధర్మేంద్ర, నసీరుద్దీన్‌ షా, అదితిరావు హైదరి తదితరులు నటించిన వెబ్‌సిరీస్‌ ‘తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌’ (Taj: Divided by Blood). దీని గురించి అదితి పలు ఆసక్తి విశేషాలు చెప్పారు.

Published : 19 Mar 2023 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ధర్మేంద్రతో కలిసి ‘తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌’ (Taj: Divided by Blood)లో నటించకపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు అదితి రావు హైదరి (Aditi Rao Hydari). తమ కాంబినేషన్‌లో సన్నివేశాలు లేకపోవడమే అందుకు కారణమని తెలిపారు. ఇతర నట దిగ్గజాలతో కలసి పనిచేయడం గొప్ప అనుభూతి పంచిందన్నారు. నసీరుద్దీన్‌ షా, ధర్మేంద్ర, జరీనా వాహబ్‌, అదితి తదితరులు ప్రధానధారులుగా దర్శకులు అజయ్‌ సింగ్‌, ప్రశాంత్‌ సింగ్‌, విభు, రాన్‌ స్కాల్‌పెల్లో తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ఇది. ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా అదితి పలు విశేషాలు పంచుకున్నారు.

అవకాశం వస్తే.. ఆలోచించా

‘తాజ్‌’లోని అనార్క‌లి పాత్రలో నటించే అవకాశం నాకు వచ్చినప్పుడు ‘చేయ‌గ‌ల‌నా?’ అని ఆలోచించా. ఒకవేళ నేను చేయనని చెప్పాలనుకున్నా దర్శకులు నా మాట వినేవారు కాదేమో. నాపై అంతగా నమ్మకం పెట్టుకున్నారు. మొఘ‌ల్- ఏ- ఆజామ్ (హిందీ చిత్రం) తరహాలోనే ఉన్నా భిన్న‌మైన కోణంలో ఈ సిరీస్‌ సాగుంతుందని, నా క్యారెక్టర్‌ మ‌ధుబాల‌ పోషించిన పాత్రను పోలి ఉంటుందని చెప్పారు. ఆ ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించేందుకు ఓకే అన్నా. ఇది మాత్రమే కాదు నేను ఎంపిక చేసుకున్న ప్రతి పాత్రను ఎంతో ఇష్టంగా పోషించా. దర్శకులు నా నుంచి ఎలా నటనను ఆశిస్తున్నారో దాన్ని ప్రదర్శించేందుకు కృషి చేస్తుంటా. ‘ఓ క్యారెక్టర్‌ వచ్చింది.. చేసేద్దాం’ అనే ధోరణిలో ఎప్పుడూ ఉండను. 

విభిన్న కోణాలున్న పాత్ర..

ఈ అనార్కలి విషయానికొస్తే.. ఓ వైపు అమాయ‌కంగా, మరోవైపు నిర్భ‌యంగా క‌నిపిస్తుంది. ఆ పాత్ర‌లో స్వ‌చ్ఛత ఉంది. పలు విభిన్న కోణాలున్న ఈ రోల్‌ ప్లే చేయడం గొప్పగా అనిపిస్తుంది. ప్రేమను మించిన శక్తిమంతమైంది మరోటి లేదని ఆ పాత్ర పోషించడం వల్ల అర్థమైంది. అంజు మోదీ నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే కథ/పాత్ర అయినా దుస్తులు సింపుల్‌గానే ఉంటాయి. ఆభరణాలు కూడా తేలికగా ఉండేలా ప్లాన్‌ చేశారు.

ఆ బాధ ఉంది..

ఈ సిరీస్‌ వల్ల ఎంతోమంది లెజెండ్స్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ముఖ్యంగా నసీరుద్దీన్‌ షాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి. మరోవైపు, ధర్మేంద్రతో నటించలేకపోయాననే బాధ ఉంది. ఆయన నటించిన ఎపిసోడ్లలో నా పాత్ర లేకపోవడంతో ఛాన్స్‌ మిస్‌ అయింది. నా దృష్టిలో గొప్ప న‌టులంతా నిగ‌ర్వులు. స‌ర‌దాగా ఉంటారు. చేస్తున్న ప‌నిని ప్రేమిస్తారు. పక్కవారిని కంఫ‌ర్ట్ జోన్‌లో ఉంచుతారు.

కఠినంగా వ్యవహరిస్తా..

నేనెప్పుడూ క‌ఠినంగానే వ్య‌వ‌హరిస్తుంటా. స్వీయ విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా చేసుకుంటుంటా. నాకు మ‌రిన్ని తెలుగు సినిమాల్లో న‌టించాల‌ని ఉంది. సినిమాల‌ను 50- 60 రోజుల్లో పూర్తి చేయగలం. అదే వెబ్ సిరీస్‌ల విషయంలో ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. నటులెవరైనా సినిమాలు, సిరీస్‌లకు వ్యత్యాసం చూడరు. ప్రేక్షకులను మెప్పించగలమా, లేదా? అనేదే పట్టించుకుంటారు.

ఆమె బయోపిక్‌లో నటించాలనుంది..

‘బాలీవుడ్ వ‌ర్సెస్ సౌత్ సినిమా’ అంశాన్ని నేను పట్టించుకోను. తమిళ చిత్రంతో నటిగా నా కెరీర్‌ మొదలైంది. నాకు ప్రాంతీయ భేదాల్లేవు. నాకు తెలుగు, త‌మిళ్ బాగా అర్థ‌మ‌వుతుంది. హిందీ మాట్లాడగలను. ఉర్దూ మేనేజ్ చేస్తా. సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. దాన్ని నేను అర్థం చేసుకోగలను. మాపై వారు చూపించే ఆద‌రాభిమానాల‌కు మురిసిపోతుంటా. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని చూశా. బాగా ఆకట్టుకుంది. రాజమౌళిసహా చిత్ర బృందం ప్రతిభ అమోఘం. ఒక‌వేళ నటి రేఖ‌ బ‌యోపిక్‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే అదొక గొప్ప అవ‌కాశంగా భావిస్తా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని